24 కోట్ల సినిమా.. 500 కోట్లు కొల్లగొట్టింది

24 కోట్ల సినిమా.. 500 కోట్లు కొల్లగొట్టింది

కంటెంట్ బలంగా ఉండాలే కానీ.. ఒక చిన్న సినిమా ఎంత పెద్ద విజయం సాధించగలదో నిరూపిస్తోంది ‘సీక్రెట్ సూపర్ స్టార్’. ఒక టీనేజీ అమ్మాయి ప్రధాన పాత్రధారిగా అమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర బడ్జెట్ కేవలం రూ.24 కోట్లు. ఐతే ఇప్పుడీ సినిమా ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి షాకిస్తోంది. ఈ వసూళ్లు వచ్చింది కూడా ఇండియాలో కాదు. చైనాలో కావడం విశేషం.

రెండు వారాల కిందట చైనాలో భారీ స్థాయిలో రిలీజైన ఈ చిత్రం రెండు వారాల్లోపే రూ.500 కోట్ల మైలురాయిని అందుకోవడం వివేషం. తొలి రోజే రూ.43 కోట్లు.. నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లు.. పది రోజుల్లోనే రూ.400 కోట్ల మైలురాళ్లను అందుకున్న ఈ చిత్రం జోరు కొనసాగిస్తూ రూ.500 కోట్ల మార్కును కూడా దాటేసింది. ఇంకా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ఇంకో రూ.200 కోట్లయినా వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.

‘త్రీ ఇడియట్స్’.. ‘పీకే’ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో చైనాలో బేస్ ఏర్పాటు చేసుకున్నాడు అమీర్ ఖాన్.  ఆ తర్వాత ‘దంగల్’ అక్కడ ఇరగాడేసి రూ.1500 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అమీర్ ఓ అతిథి పాత్ర పోషిస్తూ.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఊపు కొనసాగిస్తూ సంచలన వసూళ్లతో జైత్రయాత్ర సాగిస్తోంది చైనాలో. ఆ దేశంలో ఏ చైనాయేతర హీరోకూ లేని క్రేజ్ అమీర్ ఖాన్‌కు రావడం విశేషం. ఇక అమీర్ తర్వాతి సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా అక్కడ ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు