ఈ క్లాష్‌ పై స్పందించిన కళ్యాణ్‌

ఈ క్లాష్‌ పై స్పందించిన కళ్యాణ్‌

సంక్రాంతి తరవాత మళ్లీ తక్కువ టైంలోనే వరస కొత్త సినిమాల రిలీజులతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈవారం మాస్ మహారాజా రవితేజ టచ్ చేసి చూడు.. యంగ్ హీరో నాగశౌర్యల ఛలో సినిమాలు బాక్సాఫీసును పలకరిస్తున్నాయి. మళ్లీ వారం గ్యాప్ లోనే సాయి ధరమ్ తేజ్ ఇంటిలెజెంట్.. వరుణ్ తేజ్ తొలిప్రేమ.. మోహన్ బాబు గాయత్రి సినిమాలు థియేటర్లకు రానున్నాయి.

వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇంటిలెజెంట్ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మించారు. తన సినిమాతోపాటు రిలీజవుతున్న తొలిప్రేమ.. గాయత్రి సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు. వరుణ్ తేజ్ తో ఇంతకుముందు లోఫర్ సినిమా తీశానని.. అతడితో మంచి సన్నిహిత సంబంధం ఉందని... అందుకే అతడు నటించిన తొలిప్రేమ కూడా బాగా ఆడాలనే కోరుకుంటానని చెప్పుకొచ్చారు. ఎన్ని సినిమాలు హిట్టయితే ఇండస్ట్రీకి అంత మంచిదని అంటున్నారు.  ‘‘ఇంటిలిజెంట్ సినిమాను పేరుకు తగ్గట్టు చాలా తెలివిగా తెరకెక్కించారు. వినాయక్ అనుకున్న స్టోరీ దొరికే వరకు అసలు పనే మొదలుపెట్టడు. వినాయక్ నా సొంత తమ్ముడితో సమానం’’ అంటూ తన సినిమా డైరెక్టర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

ఇంటిలిజెంట్ తరవాత రానాతో 1945 సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సి.కళ్యాణ్ దాని తరవాత భారతి అనే సినిమాను నిర్మించనున్నట్లు చెబుతున్నారు. వీటి తరవాత వినాయక్ తో కమిట్ మెంట్ ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీపడితే అందులో సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేసిన జైసింహా సినిమా విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు కూడా పోటీ ఉన్నా తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా గెలుస్తుందనే గట్టి నమ్మకంతో ముందుకెళ్తున్నారు. మొత్తానికి ఈ క్లాష్‌ తో కళ్యాణ్‌ కు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. రిజల్ట్ పై మాత్రం ప్రభావం ఉండే ఛాన్సుంది. చూద్దాం ఏమవుతుందో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు