మళ్లీ చిరు టైటిలే కాపీ కొట్టాడే..

మళ్లీ చిరు టైటిలే కాపీ కొట్టాడే..

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తొలి రెండు సినిమాలు తమిళంలో మంచి విజయం సాధించాయి. అవి తెలుగులోనూ రిలీజయ్యాయి కానీ వాటిని మన జనాలు పట్టించుకోలేదు. కానీ ‘బిచ్చగాడు’ సినిమా మాత్రం పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. డబ్బింగ్ సినిమాల్లో ఒక ప్రత్యేక అధ్యాయాన్నే లిఖించింది. దీని తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలు వరుసబెట్టి తెలుగులోకి వచ్చాయి. కానీ అన్నీ తుస్సుమనిపించాయి. చివరగా వచ్చిన ‘ఇంద్రసేన’ అయితే దారుణమైన ఫలితాన్నందుకుంది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ చేసిన సినిమాలు తమిళంలోనూ ఆడలేదు. అయినప్పటికీ అతను హీరోగా సినిమాలు ఆగట్లేదు.

ఆల్రెడీ ‘కాళి’ అనే సినిమాలో నటిస్తున్న విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ చిత్రానికి తెలుగులో ‘రోషగాడు’ అనే టైటిల్ పెట్టడం విశేషం. చిరు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ స్ఫూర్తితో ‘ఇంద్రసేన’ అనే టైటిల్ పెట్టుకున్న విజయ్ ఆంటోనీ.. ఈసారి నేరుగా చిరు టైటిలే వాడేశాడు. ‘రోషగాడు’ పేరుతో 80ల్లో చిరు హీరోగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘రోషగాడు’ అని పెడితే.. ‘బిచ్చగాడు’ సెంటిమెంటును కూడా కొనసాగించినట్లవుతుందని భావించినట్లున్నారు. గణేషా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. విజయ్ ఆంటోనీ సొంత సంస్థలోనే ఇది తెరకెక్కనుంది. గతంలో తమిళంలో సినిమా పూర్తయ్యాక తెలుగు టైటిల్ పెట్టి ఇక్కడ ప్రమోషన్లు మొదలుపెట్టేవాడు విజయ్. కానీ ఈసారి ఆరంభంలోనే టైటిల్ ప్రకటించి ప్రమోషన్ ఆరంభించేశాడు. ఇందులో అతను పోలీస్ క్యారెక్టర్ చేస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు