బాక్సాఫీస్ వార్.. మాస్ వెర్సస్ క్లాస్

బాక్సాఫీస్ వార్.. మాస్ వెర్సస్ క్లాస్

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆశించినంత ఊపు లేదు. సంక్రాంతికి మోత మోగిపోతుందని ఆశించారు కానీ.. ‘అజ్ఞాతవాసి’ తుస్సుమనిపించి ఉత్సాహంపై నీళ్లు చల్లింది. ‘జై సింహా’ కూడా అంతంతమాత్రంగానే నడిచింది. గత వారాంతానికి మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి కానీ.. చివరికి ‘భాగమతి’ ఒక్కటే రిలీజైంది. పోటీ లేకపోవడం వల్ల ఆ సినిమాకు మంచి ఫలితమే వచ్చింది కానీ.. అది కూడా ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి అయితే ఇవ్వలేదు. ఇక ఈ వారం రెండు ఆసక్తికర సినిమాలు బాక్సాఫీస్ రేసులో దిగుతున్నాయి. అవే.. ‘టచ్ చేసి చూడు’, ‘ఛలో’.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో పలకరించి ఫామ్ చాటుకున్నాడు మాస్ రాజా. దీంతో ‘టచ్ చేసి చూడు’ మీద కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇది టిపికల్ రవితేజ స్టయిల్లో సాగే మాస్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. కమర్షియల్ హంగులకు ఇందులో లోటు లేనట్లే ఉంది. యాక్షన్.. ఎంటర్టైన్మెంట్.. రొమాన్స్ ప్రధానంగా ఈ సినిమా నడిచేలా ఉంది. ఈ చిత్రాన్ని విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇక ‘ఛలో’ విషయానికి వస్తే.. అది కూడా వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తీసిందే. ఈ చిత్రంలో క్లాస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. దీని ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. నాగశౌర్య తొలిసారి నిర్మాతగా కూడా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. మొత్తానికి ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మాస్ వెర్సస్ క్లాస్ వార్ చూడబోతున్నాం. మరి ఈ పోరులో గెలిచేదెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు