నేనే రిస్క్ చేస్తానంటున్న నాని

నేనే రిస్క్ చేస్తానంటున్న నాని

నేచురల్ స్టార్ నిర్మాతగా మారి తీసిన సినిమా ‘అ’. నిన్ననే ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఇదొక కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొదట్నుంచి ఈ చిత్ర ప్రోమోలన్నీ కూడా వైవిధ్యంగానే ఉంటున్నాయి. ఐతే ఇలాంటి విభిన్నమైన సినిమా తీసి.. బయ్యర్లను మెప్పించడం.. వాళ్లకు సినిమాను అమ్మడం అంత సులువేమీ కాదు. ఐతే నాని మాత్రం బయ్యర్లకు సినిమాను అమ్మకుండా తానే సొంతంగా రిలీజ్ చేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇందుకు కారణమేంటో కూడా నాని చెప్పాడు.


ఈ మధ్య తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఒకరు తనను కలిశారని.. ‘అ’ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే తనతోనే సినిమాను ఉంచుకుని సొంతంగా రిలీజ్ చేసుకోమని.. అలాంటివేమీ లేకపోతే బయ్యర్లకు సినిమాను అమ్మేయమని సలహా ఇచ్చాడని అతను తెలిపాడు. ఐతే ‘అ’ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవని.. అయినప్పటికీ బయ్యర్లకు అమ్మకుండా తానే సొంతంగా సినిమా రిలీజ్ చేయాలన్న రిస్కీ డెసిషన్ తీసుకున్నానని నాని చెప్పాడు. నాని అన్న ఈ మాటలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. తన ప్రొడక్షన్లో వచ్చిన తొలి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేవని ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన తొలి నిర్మాత నానీనే అవుతాడేమో. కాకపోతే తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య కమర్షియల్ ఎలిమెంట్స్ గురించేమీ అంతగా పట్టించుకోవడం లేదు. కొత్త తరహా సినిమాలకు పట్టం కడుతున్నారు. ‘అ’ను కూడా అలాగే ఆదరించి.. నాని నమ్మకాన్ని నిలబెడతారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు