నాని ‘అ’ గురించి జక్కన్న ఏమన్నాడు?

నాని ‘అ’ గురించి జక్కన్న ఏమన్నాడు?

రాజమౌళి తెలుగులో అత్యంత ఇష్టపడే యువ కథానాయకుల్లో నాని ఒకడు. అతడి నటనకు మెచ్చి ‘ఈగ’ చేయడమే కాదు.. నాని కొత్త సినిమాలు వచ్చినపుడు వెంటనే థియేటరుకెళ్లి చూసి నచ్చితే వాటి గురించి పాజిటివ్‌గా ట్వీట్లు పెడుతుంటాడు. ఇప్పుడు నాని నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ‘అ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఆ సినిమా గురించి మంచి మాటలు చెప్పాడు. ఈ వేడుకలో జక్కన్న అసలేమన్నాడంటే..

‘‘అ సినిమాలోనటించిన వాళ్లందరూ నా సన్నిహితులే. ఎవరి గురించి మాట్లాడాలో.. ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఐతే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ చూశాక మాత్రం దర్శకుడి దగ్గర్నుంచి మొదలుపెట్టాలనిపించింది. ఒక ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించాలి. ట్రైలర్ అసలు ఉద్దేశమే అది. ఆ ఉద్దేశాన్ని ‘అ’ వంద శాతం నెరవేర్చింది. ట్రైలర్ చూడగానే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనిపించింది. ఇంకా చెప్పాలంటే కుదిరితే ముందు రోజే సినిమా చూసేయాలనిపించింది. అంత బాగా ట్రైలర్ కట్ చేశారు. అందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మకు అభినందనలు.

ఇక నాని విషయానికి వస్తే అతను వరుసగా ఎన్ని హిట్లు కొట్టాడో లెక్క పెట్టడం కూడా మరిచిపోయా. బహుశా నాని పరిస్థితి కూడా అంతే అయి ఉంటుంది. నాని సినిమా అంటేనే హిట్ అనే భావన జనాల్లో వచ్చేసింది. ఐతే ఈ మధ్య పెద్ద హిట్టయిన నాని సినిమా ఒకటి చూశాక అతడికి కంగ్రాట్స్ చెబుతూ ఒక మెసేజ్ పెట్టా. హిట్లు కొట్టడం ఓకే కానీ.. నీ నుంచి ఇంకా పెద్దగా, కొత్తగా ఆశిస్తున్నానని చెప్పాను. అతడి స్నేహితులు, అభిమానులు కోరుకునేది అదే. నాని అప్పుడు సరే అన్నాడు. కట్ చేస్తే చేప అవతారంలోకి మారిపోయాడు. కానీ నేను అడిగింది ఇది కాదు. ఇక ఈ సినిమాలో రెజీనా లుక్ చూసి షాకైపోయాను. ఇలాంటి లుక్‌లోకి మారి.. వేరే ఇంకే సినిమాలు చేయదా అనిపించింది. ‘అ’ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు’’ అని రాజమౌళి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు