డబ్బింగ్ సినిమా కోసం డేట్లు మార్చాలా?

డబ్బింగ్ సినిమా కోసం డేట్లు మార్చాలా?

రజినీకాంత్ నటిస్తున్న 2.ఓ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇదో బ్రహ్మ పదార్ధం మాదిరిగా మారిపోయింది. గతేడాది దీపావళి నుంచి.. ఈ ఏడాది రిపబ్లిక్ డే కి మారి.. ఆ తర్వాత తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ఏప్రిల్ 13న విడుదల అవుతుందని చెప్పారు. మళ్లీ ఏప్రిల్ 27 అని.. కాదు ఏప్రిల్ 13 అన్నారు. మళ్లీ వాయిదా కబుర్లు వినిపిస్తున్నాయి.

ఇదంతా రజినీ సినిమా హంగామా అయితే.. దీనికి తగ్గట్లుగా రెండు తెలుగు సినిమాల విడుదల తేదీలను అటూ ఇటూ మార్చుకుంటూ తిప్పలు పడుతున్నారు మేకర్స్. రజినీ సినిమాకు పోటీ ఉండకూడదనో.. వెళ్లలేమనో చెప్పలేం కానీ.. 2.ఓ రిలీజ్ డేట్ పై ఆధారపడి.. మహేష్ బాబు ముూవీ భరత్ అనే నేను.. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రాలకు విడుదల తేదీలను ఫిక్స్ చేయలేకపోతున్నారు. అసలు.. ఓ డబ్బింగ్ సినిమా కోసం డేట్లు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. రజినీకాంత్ సినిమా కదా.. పెద్ద సినిమా కదా అనే మాట వినిపించడం సహజం.

అలాగని పోటీ ఉన్నంత మాత్రాన పెద్ద సినిమాలు ఆడవా అనే ప్రశ్నకు.. గతేడాదే సమాధానం దొరికేసింది. వారం సెలవు మాత్రమే ఉండే సంక్రాంతికే.. చిరంజీవి ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి.. శర్వానంద్ శతమానం భవతి వచ్చేసి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలాంటప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశాక వచ్చే డేట్ కావడంతో.. ఇక్కడ సెలవలు అనే సమస్యే లేదు.

ఇక పెద్ద హీరో అనే పాయింట్ ను పరిశీలిస్తే.. చిరంజీవి సినిమా అయినా పోటీగా సినిమాలు వస్తున్నాయి. పవన్ అజ్ఞాతవాసికి కాంపిటీషన్ వచ్చింది. ఈ మధ్య కాకపోయినా గతంలో మహేష్ సినిమాలకు కూడా పోటీ ఉంది. అలాంటప్పుడు రజినీకాంత్ కి దారి ఇవ్వాల్సిన అవసరం ఏంటో అర్ధం కాని విషయమే.

పోనీ.. అటు శంకర్ అయినా.. ఇటు రజినీకాంత్ అయినా ఫుల్లు ఫామ్ లో ఉన్నారా అంటే అదీ లేదాయె. అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం రోబో హిట్ తర్వాత.. రజినీకాంత్ ఇప్పటివరకూ సక్సెస్ సాధించినదే లేదు. తెలుగులో అయితే కొచ్చాడయాన్.. లింగ.. కబాలి పరిస్థితి మరీ దారుణం. ఇక శంకర్ కు కూడా రోబోనే చివరి హిట్. ఆ తర్వాత తీసిన 3ఈడియట్స్ రీమేక్ మెప్పించలేకపోగా.. ఐ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మరి వీళ్ల కాంబినేషన్ కి టాలీవుడ్ హీరోలు అంతగా భయపడాల్సిన అవసరం ఏంటబ్బా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English