షర్మిలకు తోడుగా ‘వ్యూహకర్త’

తెలంగాణా రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఓ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? అవుననే సమాధానం వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుండి. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానంటు షర్మిల రాజకీయాలకు తెరతీసిన విషయం తెలిసిందే. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి రోజున పార్టీ ప్రకటన, అజెండా, జెండా తదితరాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని పార్టీ పెట్టబోతున్న షర్మిల అందుకు వీలుగా ఓ వ్యూహకర్తను ఏర్పాటు చేసుకున్నారట. ఇంతకీ ఆ వ్యూహకర్త ఎవరయ్యా అంటే ప్రశాంత్ కిషోర్ (పీకే) శిష్యురాలు ప్రియట. ప్రియ ఎవరంటే తమిళనాడు డీఎంకే ఎంఎల్ఏ రాజేంద్రన్ కూతురు. అంతేకాకుండా ఈమెకు తమిళనాడులో సొంతంగా ఓ మీడియాను కూడా నడుపుతున్నారట.

అన్నింటికీ మించి పీకేతో కలిసి పనిచేసిన అనుభవమే చాలా ఎక్కువగా ఉందని సమాచారం. అందుకనే ఏరి కోరి తనకు అవసరంగా ఉంటుందని ప్రియను షర్మిల ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. రాబోయే అంటే 2023 ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ గట్టి ప్రభావం చూపుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపితే ఆ తర్వాత అంటే 2028 ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని కూడా మరికొందరు ఆశల పల్లకిలో ఊగుతున్నారు. సరే ఏదేమైనా పీకేను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇపుడు పీకే శిష్యురాలు ప్రియను చెల్లెలు షర్మిల వ్యూహకర్తగా పెట్టుకున్నారు. మరి ఏమవుతుందో చూడాల్సిందే.