బాలీవుడ్డోళ్ల వల్ల కానిది విజయేంద్ర ప్రసాద్ చేస్తాడా?

బాలీవుడ్డోళ్ల వల్ల కానిది విజయేంద్ర ప్రసాద్ చేస్తాడా?

‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు విజయేంద్ర ప్రసాద్. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన వెంటనే రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘భజరంగి భాయిజాన్’కు కూడా కథకుడు విజయేంద్ర ప్రసాదే. ఆ దెబ్బతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సల్మాన్ తర్వాత అక్షయ్ కుమార్ కోసం కూడా విజయేంద్ర ఒక కథ రాస్తున్నాడు. అదింకా పూర్తి కాకముందే మరో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కోసం ఆయన ఒక కథ రాసినట్లు సమాచారం. ఇటీవలే విజయేంద్ర ప్రసాద్.. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లి షారుఖ్ కు కథ కూడా వినిపించాడని వార్తలొస్తున్నాయి. షారుఖ్ కూడా ఈ కథ విషయంలో సానుకూలంగానే స్పందించాడట.

షారుఖ్ కోసం విజయేంద్ర రాసింది ఒక రివెంజ్ స్టోరీ అని అంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా ఉన్న షారుఖ్ ఖాన్.. గత కొన్నేళ్లలో బాగా వెనుకబడిపోయాడు. అమీర్ ఖాన్ అతడిని దాటి ఎక్కడికో వెళ్లిపోయాడు. సల్మాన్ ఖాన్ సైతం అతడిని దాటేశాడు. షారుఖ్ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. షారుఖ్‌కు హిట్టివ్వాలని గత కొన్నేళ్లుగా చాలామంది బాలీవుడ్ రచయితలు, స్టార్ డైరెక్టర్లు ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ విజయవంతం కాలేదు.

గత ఏడాది అతడి సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ పెద్ద డిజాస్టర్ అయింది. ‘రయీస్’ కూడా నిరాశ పరిచింది. ఇప్పుడతడి ఆశలన్నీ ‘జీరో’ మీదే ఉన్నాయి. అందులో షారుఖ్ మరగుజ్జుగా నటిస్తున్నాడు. ఇది ఆడినా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందా అన్నది సందేహమే. మళ్లీ షారుఖ్ స్థాయి ఏంటో చాటిచెప్పే బ్లాక్ బస్టర్ అతడికి అవసరం. అది విజయేంద్ర కథతో సాధ్యమవుతుందా.. బాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్ల వల్ల కానిది విజయేంద్ర ప్రసాద్ వల్ల అవుతుందా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English