పద్మావత్.. అన్నింటినీ దాటేసింది

పద్మావత్.. అన్నింటినీ దాటేసింది

ఇండియాలో అయితే ‘పద్మావత్’ అనేక రకాల అడ్డంకులు ఎదురయ్యాయి. సెన్సార్ సమస్యలు తలెత్తాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్రదర్శనకే నోచుకోలేదు. అయినప్పటికీ తొలి వారాంతంలో ‘పద్మావత్’కు అంచనాల్ని మించి వసూళ్లు వచ్చాయి. రూ.100 కోట్ల క్లబ్బు దిశగా దూసుకెళ్లిందీ సినిమా.

ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిత్రానికి అడ్డేముంది..? ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ‘పద్మావత్’ అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ‘పద్మావత్’ 3.5 మిలియన్ డాలర్లు.. అంటే రూ.22.2 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది.

కేవలం శనివారం ఒక్కరోజే ఈ చిత్రానికి 1.85 మిలియన్ డాలర్ల వసూళ్లు రావడం విశేషం. ఓ హిందీ సినిమా ఉత్తర అమెరికాలో ఇప్పటిదాకా ఒక్క రోజులో సాధించిన అత్యధిక వసూళ్లు ఇవే. 1.41 మిలియన్ డాలర్లతో ‘పీకే’ నెలకొల్పిన రికార్డును ‘పద్మావత్’ దాటేసింది. సంజయ్ లీలా బన్సాలీ సినిమాలకు ముందు నుంచి అమెరికాలో ఆదరణ బాగుంటోంది. దశాబ్దం కిందటే బన్సాలీ సినిమాలు అక్కడ అదరగొట్టాయి. వాళ్ల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తీస్తాడు బన్సాలీ.

‘పద్మావత్’ వివాదాల కారణంగా కొన్ని నెలల నుంచి జనాల నోళ్లలో నానడం.. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆ ఆసక్తి వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు