దిల్ రాజు లేడు.. ఆ సినిమా ఉంది

దిల్ రాజు లేడు.. ఆ సినిమా ఉంది

టాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు దిల్ రాజు. కానీ ఎప్పుడూ కూడా బడ్జెట్ విషయంలో రాజు హద్దులు దాటింది లేదు. మహేష్ బాబు-వెంకటేష్ లాంటి ఇద్దరు స్టార్లతో సినిమా చేసినా.. దాన్ని కూడా పరిమిత బడ్జెట్లోనే నిర్మించాడు శంకర్. అలాంటిది ఆయన రూ.200 కోట్లతో ‘భారతీయుడు-2’ సినిమా తీయబోతున్నాడన్న ప్రకటన వినగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇది నిజమే అని ధ్రువీకరిస్తూ గత దసరా పండక్కి దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌లను కూడా కలిశాడు రాజు. ఐతే ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేకపోయింది. కానీ ఈ మధ్యే తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు రాజు.

ఐతే దిల్ రాజు తప్పుకున్నంత మాత్రాన ఈ ప్రాజెక్టు ఏమీ ఆగిపోలేదు. శంకర్ వేరే నిర్మాతను ఆల్రెడీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇంకా నిర్మాత ఎవరన్నది బయటికి రాలేదు కానీ.. శంకర్ మాత్రం త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతున్న విషయాన్ని ధ్రువీకరించాడు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా తైవాన్‌లో ‘ఇండియన్-2’ ఎయిర్ బెలూన్‌‌ను లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు శంకర్. అక్కడ శంకర్ ఏమీ మాట్లాడలేదు కానీ.. సినిమా ఈజ్ ఆన్ ట్రాక్ అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. నిజానికి శంకర్-కమల్ ‘ఇండియన్-2’ కోసం దిల్ రాజును ఎంచుకోవడమే ఆశ్చర్యం. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీళ్లిద్దరూ ఊ అనాలే కానీ.. చాలామంది నిర్మాతలు ముందుకొచ్చి ఉంటారు. వాళ్లలోంచి శంకర్ ఎవరిని ఎంచుకున్నాడో చూడాలి. ప్రస్తుతం శంకర్ ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు. ఆ సినిమా రిలీజయ్యాక ‘ఇండియన్-2’ పట్టాలెక్కొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు