‘పద్మావత్’ను ఎక్కువ చేసి చూపిస్తున్నారా?

‘పద్మావత్’ను ఎక్కువ చేసి చూపిస్తున్నారా?

ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ దాటుకుని ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘పద్మావత్’ సినిమా. విడుదలకు రెండు రోజుల ముందే దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ప్రెస్ వాళ్లకు స్పెషల్ ప్రివ్యూలు వేయించాడు. చూసిన వాళ్లందరూ ఈ సినిమా ఒక అద్భుతం అనేస్తున్నారు. దీన్ని ఒక ‘మాస్టర్ పీస్’గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అయితే ఈ చిత్రానికి ఏకంగా 4.5 స్టార్లు ఇచ్చి ‘ఔట్ స్టాండింగ్’ అని తీర్పిచ్చేశారు. ఐతే నిజంగా ఈ సినిమా అంత గొప్పగా ఉంటుందన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఇంతకుముందు బన్సాలీ తీసిన ‘బాజీరావు మస్తానీ’ గురించి కూడా క్రిటిక్స్ ఆహా ఓహో అనేశారు. దాన్నొక కళాఖండంగా అభివర్ణించారు.

తీరా చూస్తే అది మరీ అంత అద్భుతంగా ఏమీ అనిపించలేదు. ఆర్టిస్టిగ్‌గా గొప్పగా అనిపించొచ్చేమో కానీ.. సగటు ప్రేక్షకుడి సహనాన్ని ఆ చిత్రం పరీక్షిస్తుంది. అది కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. బన్సాలీ గొప్పగా సినిమాలు తీస్తాడు కానీ.. అవి సగటు ప్రేక్షకుడి అంతగా అర్థం కావని.. అంత జనరంజకంగా ఉండన్న అభిప్రాయాలున్నాయి. ‘పద్మావత్’ విషయంలోనూ అలాగే ఉంటుందేమో అన్న సందేహాలు లేకపోలేదు. దీనికి తోడు కర్ణిసేన ఈ చిత్రానికి వ్యతిరేకంగా చేసిన అల్లర్లు, గొడవల పట్ల అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా సినీ, మీడియా వర్గాలు ఈ విషయంలో చాలా కోపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బన్సాలీకి అండగా నిలిచేందుకు ‘పద్మావత్’ను ఉన్నదాని కంటే గొప్పగా చేసి చూపిస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఈ సినిమా ఎలా ఉందన్నది రేపు ఉదయం సామాన్య ప్రేక్షకులు చూశాకే తేలుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు