తెలంగాణలో మనోళ్ల వాదనలో పస లేదు జగన్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్కసారిగా ముదిరిన జల వివాదం విషయంపై కాస్త ఆలస్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించటం తెలిసిందే. మంత్రివర్గ భేటీలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలోని మనోళ్ల కోసమే సంయమనం పాటించాల్సి వస్తోందని జగన్ పేర్కొనటం కొత్త రచ్చకు కారణమైంది. ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రజలు వేరు..రాజకీయం వేరు.. రాజకీయ నేతలు వేరు. పాలకులు వేరన్న సంగతి మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమ సమయంలోని మాటలకు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే బాగా అర్థం చేసుకున్నారు.

తెలుగు నేల రెండు ముక్కలై.. రెండు రాష్ట్రాలుగా ఏర్పడితే ఏదో జరిగిపోతుందన్న భ్రమలు తొలిగిపోవటమే కాదు.. దొందూ దొందే అన్న విషయాన్ని తెలంగాణ ప్రజల కంటే కూడా తెలంగాణ ఉద్యమకారులకు బాగా అర్థమైంది. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆశలు.. ఆకాంక్షలు అన్న మాటను తరచూ ప్రస్తావించే వీలు ఉండటంతో పాటు.. ఆ పేరుతో డిమాండ్ చేసి మరీ కొన్నింటిని సాధించుకునే వారు. సొంత రాష్ట్రంలో ఆ వెసులుబాటు మిస్ అయ్యిందన్న విషయాన్ని చాలామంది తెలంగాణ వారు పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు.

జల వివాదం ఏదైనా రాష్ట్ర పాలకుల మీద ఆధారపడి ఉంటుందే తప్పించి.. ప్రజలకు నేరుగా లింకు లేనిది. తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు విషయానికి వస్తే.. అక్రమ ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం.. కాదు.. సక్రమమే అంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడున్న సున్నితమైన విషయాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. అదేమంటే.. ఆర్నెల్ల క్రితమే రాయలసీమ ప్రాజెక్టుకు టెండర్లు పిలిస్తే.. అప్పుడు అభ్యంతరం చెప్పని తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడే ఎందుకు తెర మీదకు తెచ్చారు? సీఎం కేసీఆర్ ఎజెండా ఏమిటన్న విషయాన్ని ఏపీ ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాల్ని రెచ్చగొడితే.. రెచ్చిపోవటానికి సిద్ధంగా లేమని తెలంగాణ వాదులు స్పష్టం చేస్తున్నారు.

అదే సమయంలో.. మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తెలంగాణలో మనోళ్లు (ఆంధ్రోళ్లు) ఉన్నారు. మనం గట్టిగా మాట్లాడితే వారికి ఇబ్బంది కలుగుతుందంటూ అభిమానాన్ని ప్రదర్శించారు. తెలంగాణలోని ఏపీ ప్రజల మీద జగన్ కు అభిమానమే ఉంటే.. దాన్ని మరోలా ప్రదర్శించాలి కానీ.. ఇలా ఇరుకున పెట్టేలా కామెంట్ చేయటం ఏ మాత్రం సరికాదు. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్లు.. తమ రాష్ట్రంలో భాగమన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. సెటిలర్లు అనే పదమే లేదని.. వారి కాలికి ముల్లు గుచ్చుకుంటే.. తన పంటితో తీస్తానని వ్యాఖ్యానించారు.

అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే జగడానికి.. ప్రజలకు సంబంధం ఏమిటి? ఎందుకంటే.. వివాదాలన్ని రాజకీయ కోణంలో జరిగేవే తప్పించి.. ప్రజల ఇష్టాయిష్టాలకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని తెలుగు ప్రజలు గుర్తించారు. అందుకే.. తెలంగాణలోని ఆంధ్రోళ్ల గురించి జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల మధ్య రచ్చ మొదలు కాగానే.. తెలంగాణ ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న ఆంధ్రోళ్లను టార్గెట్ చేస్తారన్న దూరాలోచన చేయాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే.. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చే మాటలే.. లేని కొత్త ఆలోచనలకు తెర తీస్తాయని చెప్పాలి. అందుకే.. ఏపీ సీఎం తన రాష్ట్రంలోని ప్రజల గురించి ఆలోచిస్తే చాలు.. వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రోళ్ల గురించి అనవసరమైన ఆందోళన అవసరం లేదు. ఒకవేళ..నిజంగానే అవసరం వస్తే అప్పుడు ఆదుకుంటే మంచిది. అంతేకానీ.. ఈ వివాదంలోకి లాగటం ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం రెండు రాష్ట్రాల్లోని ప్రజల మాటల్లో వినిపిస్తోంది.