డ‌బ్బులు కాదు... క‌థ‌లు కావాలి

డ‌బ్బులు కాదు... క‌థ‌లు కావాలి

ప్ర‌పంచంలో ప్ర‌తి చోటా ఉన్న స‌మ‌స్యే ఇది. ఆడవాళ్లు ఆకాశంలో స‌గం అంటారు, మ‌గ‌వాడిలో స‌గం అంటారు... అందుకేనేమో ప్ర‌తిచోటా పురుషుల‌తో పోలిస్తే సగం జీతమే ఇచ్చి పంపిస్తారు. మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా ప‌నిచేసినా స‌రే, వారికి ద‌క్కేది అర‌కొర డ‌బ్బులే. సినిమా రంగంలో కూడా ఇదే స‌మ‌స్య‌. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఎంతో మంది హీరోయిన్లు, న‌టీమ‌ణులు పెద‌వి విరుస్తూనే ఉన్నారు. కానీ మ‌న దేవ‌సేన అనుష్క వెరైటీగా స్పందించింది. అంతేకాదు మ‌గ‌వాళ్ల‌కే ఎక్కువ పారితోష‌కం ఇవ్వ‌డంపై కూడా ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధానం ఇచ్చింది.


సినిమాల‌లో హీరోకే ఎక్కువ పారితోషికం ఇస్తారు. హీరోయిన్ల‌కు వారికిచ్చే స‌గం క‌న్నా త‌క్కువ ఇస్తారు. అదీ పెద్ద హీరోయిన అయితేనే కోటి దాకా చేరుతుంది. చిన్న హీరోయిన్ల‌కు ల‌క్ష‌ల్లోనే స‌రిపెట్టేస్తారు. ఇలా హీరోల‌కు కోట్ల కొద్దీ డ‌బ్బును పారితోషికంగా ఇవ్వ‌డాన్ని జేజ‌మ్మ వెన‌కేసుకొస్తోంది. హీరోల‌కు ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డంలో త‌ప్పు లేదంటోంది. సినిమా ఫ్లాఫ‌యితే అంద‌రి క‌న్నా చెడ్డ‌పేరు వ‌చ్చేది హీరోకు, ద‌ర్శ‌కుడికేన‌ని చెప్పింది. సినిమా ఆడ‌క‌పోయినా హీరోయిన్‌కు వ‌చ్చిన ముప్పేమీ  లేద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఆడ‌వాళ్ల‌కు ఎక్కువ పారితోషికం అనే విష‌యం గురించి చ‌ర్చించేక‌న్నా... అస‌లెందుకు వుమెన్ ఓరియంటెడ్ స్టోరీలు ఎక్కువ‌గా రావ‌డం లేదు అన్న‌దాని గురించే మాట్లాడాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. హీరో కోసం క‌థ రాసిన‌ట్టే... హీరోయిన్ల‌నే ప్ర‌ధాన పాత్ర గా క‌థ‌లు ఎందుకు రాయ‌డం లేద‌ని, సినిమాలు ఎందుకు తీయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తోంది. అలా హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర సినిమాలు వ‌స్తే... వారికిచ్చే పారితోషికం కూడా దానిక‌దే పెరుగుతుంద‌ని స్వీటీ అభిప్రాయం. అది కూడా నిజమే అనిపిస్తోంది క‌దూ!

ప్ర‌స్తుతం స్వీటీ భ‌విష్య‌త్తంతా భాగ‌మ‌తి మీదే ఆధార‌ప‌డి ఉంది. ఆ సినిమా మ‌రో అరుంధ‌తి అవుతుంద‌ని ఆశ‌ప‌డుతోంది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు