పద్మావతి గొడవ ఒక కొలిక్కి వచ్చిందబ్బా

పద్మావతి గొడవ ఒక కొలిక్కి వచ్చిందబ్బా

మొత్తానికి ‘పద్మావతి’ ఆ సినిమాకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందటే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందు ప్రచారం జరిగినట్లు ఈ సినిమాకు భారీగా ఏమీ కోతలు కూడా విధించలేదు. ఐదు చోట్ల చిన్న చిన్న కట్స్‌ వేసి.. పేరు మార్చాలని సూచించి సినిమాను ఓకే చేసింది సెన్సార్ బోర్డు. సెన్సార్ సమస్య తొలగిపోవడంతో రిలీజ్ డేట్ ఇచ్చింది చిత్ర బృందం.

మరోవైపు ఉత్తరాదిన నాలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ చిత్రంపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసి దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీకి ఊరటనిచ్చింది. కానీ కర్ణిసేన ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి సందేహించారు.

మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ‘పద్మావత్’ సజావుగా విడుదలవుతుందో లేదో అన్న సందేహాలు రేకెత్తాయి. ఇలాంటి తరుణంలో కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి చేసిన ప్రకటన చిత్ర బృందానికి ఊరటనిచ్చేదే. ఈ చిత్రాన్ని ఒకసారి చూసి రాజ్ పుత్‌లకు వ్యతిరేకంగా ఉందో లేదో తెలుసుకుని ఆ తర్వాత దీన్ని బహిష్కరించే నిర్ణయం తీసుకోవాలని బన్సాలీ ముందు నుంచి చేస్తున్న విజ్ఞప్తిని ఎట్టకేలకు కల్వి పట్టించుకున్నాడు. సినిమా చూసి అభ్యంతరాలేమైనా ఉంటే ఆ మేరకు సన్నివేశాలు తొలగిస్తామంటూ తాజాగా బన్సాలీ తనకు రాసిన లేఖకు స్పందిస్తూ సినిమా చూసేందుకు కల్వి అంగీకరించాడు.

సినిమా చూశాక ‘పద్మావత్’ను దేశవ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చా లేదా.. కొన్ని రాష్ట్రాల్లో ఆపాలా అనే విషయాన్ని నిర్ధరిస్తామని.. తనతో పాటు సెన్సార్ బోర్డు నుంచి ముగ్గురు.. ఎంపిక చేసిన కొందరు జర్నలిస్టులకు కూడా ఈ సినిమా చూపించాలని కల్వి షరతు పెట్టాడు. అందుకు బన్సాలీ అంగీకరించాడు. సినిమా చూశాక ఈ రోజో రేపో కల్వి ఒక ప్రకటన చేసే అవకాశముంది. చూస్తుంటే విడుదల ముంగిట ‘పద్మావత్’కు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు