వర్మ-పూరి.. కామెడీలు చాలించండి సార్లూ

వర్మ-పూరి.. కామెడీలు చాలించండి సార్లూ

గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఈ కాలంలో ఆయన్నుంచి వచ్చిన ఏకైక హిట్టు ‘టెంపర్’. ఆ కథ ఆయన సొంతం కాదు. వక్కంతం వంశీ రాసింది. ఈ సినిమా విజయంలో తన క్రెడిట్ పెద్దగా ఏమీ లేదని రుజువు చేస్తున్నట్లుగా దాని తర్వాత సారు ఐదు డిజాస్టర్లిచ్చాడు. చివరగా నందమూరి బాలకృష్ణతో ఆయన తీసిన ‘పైసా వసూల్’ కూడా తుస్సుమనిపించింది. ఇప్పుడేమో కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పెట్టి ‘మెహబూబా’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ చిత్ర బృందమేదో హడావుడి చేస్తోంది కానీ.. ఇప్పటిదాకా దీనికి ఎలాంటి బజ్ రాలేదు. ఐతే ఇప్పుడు పూరి గురువు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి.. దీనికి హైప్ తెద్దామని ప్రయత్నిస్తున్నాడు.

‘మెహబూబా’లోని రెండు సీన్లు చూశాడట వర్మ. అవి చూశాక దీంతో పూరి తీసిన ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ను పోల్చి చూస్తే ఫ్లాప్ అనిపించిందట వర్మకు. కొడుకు మీద ప్రేమతో ‘మెహబూబా’ సినిమాను అంత గొప్పగా తీసేశాడట పూరి. అంతే కాదు.. పూరి కొడుకు ఆకాశ్ అదరగొట్టేశాడని.. తెలుగులో తాను చూసిన తొలి మెథడ్ యాక్టర్ అతనే అని.. ప్రతి సీన్లోనూ అద్భుతంగా చేశాడని కితాబిచ్చాడు వర్మ. దీనికి పూరి ఎగ్జైట్ అయిపోతూ.. తన గురువు తొలిసారిగా తనను ఒక ఫిలిం మేకర్‌గా గుర్తించాడని అన్నాడు. ఐతే తనకు ఎగ్జైట్మెంట్ కలిగితే వర్మ ఎవరినైనా ఎలా పడితే అలా పొగిడేస్తుంటాడు.

పూరి తీసిన ‘టెంపర్’ గురించి ఇలాగే మాట్లాడాడు వర్మ. సినిమా బాగానే ఉండటంతో ఓకే అనుకున్నారు. కానీ ‘జ్యోతిలక్ష్మీ’.. ‘లోఫర్’ సినిమాల గురించి కూడా వర్మ ఇలాగే గొప్పగా చెప్పాడు. అందులోనూ ‘లోఫర్’ గురించైతే తెగ పొగిడేశాడు. కానీ ఆ రెండు సినిమాల పరిస్థితేంటో తెలిసిందే. కాబట్టి వర్మ-పూరిల మాటలు చాలామందికి కామెడీగా అనిపిస్తున్నాయి. మరి నిజంగా వర్మ చెబుతున్నంత విషయం ‘మెహబూబా’లో ఉందేమో థియేటర్లలో చూసి తెలుసుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు