కొడుకు చేయకుంటే ఆ హీరోనే ‘అర్జున్ రెడ్డి’ అయ్యేవాడట

కొడుకు చేయకుంటే ఆ హీరోనే ‘అర్జున్ రెడ్డి’ అయ్యేవాడట

‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను ఇంకో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు చాలామంది. ఐతే తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ కథ కోసమే ధ్రువ్ అనుకున్న దాని కంటే త్వరగా హీరోగా మారుతున్నట్లు విక్రమ్ వెల్లడించాడు.

తన కొడుకును ఇంకో మూడేళ్ల తర్వాత హీరోను చేయాలన్నది తన ప్రణాళిక అని.. ఐతే అతడి ఫొటోలు, డబ్ స్మాష్ వీడియోలు చూసిన నిర్మాతలు ఇప్పుడే హీరోగా పరిచయం చేయాలని అన్నారని.. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తనను కలిశారని.. దీంతో తాను కూడా ఒప్పుకోక తప్పలేదని విక్రమ్ తెలిపాడు.

‘అర్జున్ రెడ్డి’ తనకు బాగా నచ్చిన సినిమా అని.. ఈ చిత్రాన్ని తన కొడుకు చేయకపోయి ఉంటే తానే హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నించేవాడినని విక్రమ్ చెప్పడం విశేషం. తనకు వయసు పెద్ద సమస్యగా భావించడం లేదని.. ఈ పాత్రకు తగ్గట్లుగా మౌల్డ్ అయ్యేవాడినని అతనన్నాడు. తమిళంలో ‘వర్మ’ పేరుతో తెరకెక్కనున్న ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదని.. తన కొడుకు ప్రస్తుతం విదేశాల్లో మెథడ్ యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడని విక్రమ్ వెల్లడించాడు.

‘సేతు’, పితామగన్’ లాంటి సినిమాలతో తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన బాలాకు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు విక్రమ్. ఈ చిత్రానికి ఇంకా కథానాయికను ఎంపిక చేయలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు