శింబు గొడవ.. విశాల్‌ను ఇరికించేశారు

శింబు గొడవ.. విశాల్‌ను ఇరికించేశారు

తమిళ వివాదాస్పద కథానాయకుడు శింబు మీద కొన్ని రోజుల కిందట మైకేల్ రాయప్పన్ అనే నిర్మాత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శింబుతో తీసిన ‘ఏఏఏ’ సినిమా వల్ల తాను రూ.20 కోట్ల దాకా నష్టపోయి రోడ్డున పడ్డానని.. దీనికంతటికీ శింబునే కారణమని.. అతను సహకరించకపోవడం వల్లే సినిమాకు అలాంటి ఫలితం వచ్చిందని అతను ఆరోపించాడు.

నిర్మాతల మండలిలోనూ శింబు మీద ఫిర్యాదు చేశాడు మైకేల్. ఐతే తర్వాత పరిణామాలేంటన్నది తెలియరాలేదు. నిర్మాతల మండలి శింబు మీద ఎలాంటి చర్య చేపట్టలేదు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి.

ఇప్పుడు మైకేల్ రాయప్పన్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘కీ’ ఆడియో వేడుక జరిగింది. దీనికి నిర్మాతల మండలి అధ్యక్షుడైన విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకకు హాజరైన మరో నిర్మాత.. వేదిక మీద ఉన్న విశాల్‌ను ఇరుకున పెట్టే ప్రశ్న వేశాడు. శింబు మీద మైకేల్ చేసిన ఆరోపణల మాటేంటని.. అతడి మీద ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. దీంతో విశాల్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. మరో అతిథి.. ఇప్పుడిది సందర్భం కాదని వారించినా ఫలితం లేకపోయింది. దీంతో విశాల్ మైక్ అందుకున్నాడు. మైకేల్ ఆరోపణలపై శింబుకు నోటీసు పంపించామని.. ఐతే అతడి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపాడు. ఈ విషయాన్ని వదిలిపెట్టమని అన్నాడు.

ఐతే ‘ఏఏఏ’ సినిమా వల్ల నష్టపోయిన మైకేల్‌ను ఆదుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. తన వంతుగా మైకేల్ కొత్త సినిమా ‘కీ’ కోసం తన సినిమా ‘ఇరుంబు తురై’ను వాయిదా వేస్తానన్నాడు. ఫిబ్రవరి 9న ‘కీ’ని విడుదల చేసుకోవచ్చన్నాడ. అలాగే మైకేల్ కోసం తాను ఓ సినిమా చేయడానికి సిద్ధమని కూడా ప్రకటించాడు. మొత్తానికి శింబు చేసిన పాపానికి ఇలా విశాల్ ఇబ్బంది పడుతున్నాడన్నమాట.