చైనాలో అమీర్ ఖాన్ నయా సంచలనం

చైనాలో అమీర్ ఖాన్ నయా సంచలనం

చైనాలో చైనా సినిమాలు కాకుండా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఆదరణ ఉండేది ఒకప్పుడు. అక్కడి మార్కెట్లోకి ఇండియన్ సినిమా ప్రవేశించడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ జింక్స్‌ను బ్రేక్ చేసింది అమీర్ ఖానే. అతడి సినిమాలు ‘3 ఇడియట్స్’.. ‘పీకే’ అక్కడ ఓ మోస్తరుగా ఆడి ఇండియన్ సినిమాలకు బేస్ సెట్ చేశాయి. ఐతే దీన్ని మిగతా సినిమాలు పెద్దగా అందిపుచ్చుకున్నది లేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’ను గట్టి ప్రచారం మధ్య అక్కడ విడుదల చేస్తే రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. కానీ దీని తర్వాత వచ్చిన అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. అక్కడ ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఐతే అది పూర్తిగా అమీర్ ఖాన్ సినిమా. కానీ ఇప్పుడు అమీర్ గెస్ట్ రోల్ చేసిన సినిమా సైతం అక్కడ సంచలన ఓపెనింగ్స్‌తో ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమీర్ ఓ అతిథి పాత్ర చేస్తూ సొంత బేనర్లో నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ గత ఏడాది విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు చైనాలో రిలీజ్ చేశారు. ఇది ‘దంగల్’తో పోలిస్తే తొలి రోజు మూడింతట ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం. ‘దంగల్’కు మొదటి రోజు 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తే.. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఏకంగా 6.4 మిలియన్ డాలర్లు.. అంటే రూ.43 కోట్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ప్రి సేల్స్ ద్వారా మాత్రమే రెండున్నర మిలియన్ల దాకా వసూలయ్యాయట. దీన్ని బట్టే అమీర్ మార్కెట్ చైనాలో ఏ రేంజికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి అక్కడ మంచి టాక్ రావడంతో ‘దంగల్’ తరహాలోనే దీనికి భారీ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అమీర్ మాజీ మేనేజర్ అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు