ఆ మ్యాజిక్ మళ్లీ రిపీటవుతుందా?

ఆ మ్యాజిక్ మళ్లీ రిపీటవుతుందా?

కొన్ని రోజుల కిందటే ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ తో పలకరించాడు మంచు విష్ణు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ అయింది. టీజర్ తో పోలిస్తే ట్రైలర్ భిన్నంగా ఏమీ లేదు. దానికి ఇది ఎక్స్‌టెన్షన్ లాగా అనిపిస్తోంది. మంచు విష్ణు-జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాల తరహాలోనే కామెడీ-యాక్షన్-రొమాన్స్ కలిపి కొట్టినట్లున్నారు సినిమాలో. సినిమాలో కామెడీకి ఢోకా లేనట్లే అనిపిస్తోంది కానీ.. అందులో కొత్తదనం అయితే కనిపించట్లేదు.

పురోహితుడిగా బ్రహ్మానందంను లెక్కలేనన్ని సినిమాల్లో చూశాం. ఆయన కామెడీ చాలా పాత సినిమాల్ని గుర్తుకు తెస్తోంది. మంచు విష్ణును సైతం ‘దేనికైనా రెడీ’లోనే ఈ తరహా పాత్రలో చూశాం. విష్ణు.. బ్రహ్మిని వాడుకునే సినిమాలూ గతంలో లేకపోలేదు. హీరోయిన్ ప్రేమ కోసం బ్రహ్మి అండ్ బ్యాచ్ ను తప్పుదోవ పట్టించి అమెరికాకు పట్టుకొచ్చేసే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు విష్ణు ఇందులో. విష్ణు-ప్రగ్యా జైశ్వాల్ జోడీగా బాగానే ఉంది. ‘రోగ్’.. ‘సింగం-3’ సినిమాల ఫేమ్ ఠాకూర్ అనూప్ సింగ్ విలనీ రొటీన్ అనిపిస్తోంది.

మినిమం గ్యారెంటీ కామెడీ అందిస్తాడని పేరున్న నాగేశ్వరరెడ్డి.. తన మార్కు వినోదంతో చాలాసార్లు విజయవంతమయ్యాడు. ఐతే అతను చివరగా తీసిన ‘ఆటాడుకుందాం రా’ తేడా కొట్టేసింది. మరి ‘దేనికైనా రెడీ’.. ‘కరెంటు తీగ’.. ‘ఈడోరకం ఆడో రకం’ తరహా మ్యాజిక్‌ను అతను మళ్లీ రిపీట్ చేస్తాడేమో చూడాలి. నిజానికి ఇప్పుడు నడుస్తున్న కామెడీ ట్రెండ్ వేరు. సింపుల్ అండ్ సటిల్ కామెడీకి జనాలు పట్టం కడుతున్న ఈ రోజుల్లో.. కొన్నేళ్ల కిందట రాజ్యం ఏలిన లౌడ్ కామెడీతో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’కు జనాలు ఎలాంటి ఫలితాన్నందిస్తారో చూడాలి. ఈ చిత్రం గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు