ఇది కూడా మొక్కుబడి రిలీజేనా?

ఇది కూడా మొక్కుబడి రిలీజేనా?

‘అందాల రాక్షసి’.. ‘అలా ఎలా’ లాంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపే సంపాదించాడు రాహుల్ రవీంద్రన్. కానీ ఈ సినిమాలు తెచ్చిన గుర్తింపును అతను నిలబెట్టుకోలేకపోయాడు. హీరోగా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. అతిథి పాత్రలకు మారిపోయాడు. అవేమంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. హీరోగా అతడి సినిమాలు వస్తున్నది వెళ్తున్నది కూడా తెలియట్లేదు. కొంత విరామం తర్వాత అతను హీరోగా నటించిన ‘హౌరా బ్రిడ్జ్’ కొంచెం ఆసక్తి రేకెత్తించింది. ఈ చిత్ర ఫస్ట్ల్ లుక్ పోస్టర్లు.. టీజర్ ఆసక్తి రేకెత్తించాయి. జనాల్లో ఈ సినిమాపై కొంత చర్చ జరిగింది. ఐతే ఆ సమయంలోనే సినిమాను రిలీజ్ చేస్తే బాగుండేదేమో.

కొన్ని నెలలుగా వార్తల్లోనే లేకుండా పోయాక.. ‘హౌరా బ్రిడ్జ్’ అనే సినిమా ఒకటి ఉందని అందరూ మరిచిపోయాక ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే వీకెండ్లోఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ జనవరి 26కు ఆల్రెడీ మూడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. అందులో ‘భాగమతి’పై మంచి అంచనాలున్నాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘మనసుకు నచ్చింది’కి కూడా ఓ మోస్తరుగా బజ్ ఉంది. వీటికి పోటీగా ‘పద్మావత్’ తెలుగు వెర్షన్ కూడా రిలీజవుతోంది. ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో ఎంతో కొంత క్రేజ్ ఉన్న ఆ సినిమాలకే ఏమాత్రం ఆదరణ దక్కుతుందో అనుకుంటుంటే.. ‘హౌరా బ్రిడ్జ్’ను కూడా అదే రోజుకు షెడ్యూల్ చేశారు. దీనికి పెద్దగా ప్రమోషన్లు కూడా లేవు ఇప్పటిదాకా. ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి అన్నట్లుగా మొక్కుబడిగా రిలీజ్ చేసేస్తున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తుంటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు