ఆశలన్నీ వక్కంతం మీదే..

ఆశలన్నీ వక్కంతం మీదే..

రెండేళ్ల విరామం తర్వాత గత దీపావళికి ‘రాజా ది గ్రేట్’తో పలకరించాడు మాస్ రాజా రవితేజ. ఆ చిత్రం అతడికి మంచి ఫలితాన్నే ఇచ్చింది. మాస్ రాజా ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇక రవితేజ అభిమానుల దృష్టంతా ‘టచ్ చేసి చూడు’ మీదే ఉంది. ‘రాజా ది గ్రేట్’ కంటే ముందు మొదలైన సినిమా ఇది. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ పనితీరు నచ్చక రవితేజ ఈ సినిమాను ఆపించేసినట్లు గుసగుసలు వినిపించాయి. కొన్ని నెలల పాటు ఈ చిత్రం వార్తల్లోనే లేకుండా పోయింది.

కానీ ‘రాజా ది గ్రేట్’ రిలీజయ్యాక ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. షూటింగ్ పున:ప్రారంభించి సినిమాను పూర్తి చేశారు. విడుదలకు సిద్ధం చేశారు. ఈ మధ్యే రిలీజైన టీజర్లో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఇంతకుముందు ఈ సినిమాపై జరిగిన నెగెటివ్ ప్రచారం వల్ల.. ఈ సినిమా తీస్తోంది కొత్త దర్శకుడు కావడం వల్ల అంచనాలు పెద్దగా లేవు. కాకపోతే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించడం ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. దీని కంటే ముందు వంశీ కథ అందించిన ‘టెంపర్’ మంచి ఫలితాన్నందుకుంది. గతంలో సురేందర్ రెడ్డి సినిమాలకు వరుసగా పని చేసిన వక్కంతం.. తర్వాత అతడి నుంచి విడిపోయాడు. సొంతంగా దర్శకత్వం చేపట్టేందుకు ప్రయత్నాలు చేసుకున్నాడు. అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో ‘నా పేరు సూర్య’ లాంటి క్రేజీ ప్రాజెక్టు ద్వారా అతను దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆ చిత్ర టీజర్ వక్కంతంపై అంచనాలు పెంచింది. దర్శకుడిగా లాంచ్ కావడానికి ముందు ‘టచ్ చేసి చూడు’ రచయితగా వక్కంతంకు మరో బ్రేక్ ఇచ్చి అతడిపై అంచనాల్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. మరి ‘టచ్ చేసి చూడు’లో వంశీ ఏం ప్రత్యేకత చూపించాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు