'ప‌ద్మావ‌త్'ను ముస్లింలు చూడ‌కండి...అస‌ద్ పిలుపు!

'ప‌ద్మావ‌త్'ను ముస్లింలు చూడ‌కండి...అస‌ద్ పిలుపు!

ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ‘పద్మావత్’ చిత్రం బాలారిష్టాల‌ను దాటుకొని ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న విడుద‌ల కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో రాణి ప‌ద్మిని దేవి పాత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని, ఆ సినిమాను నిషేధించాల‌ని రాజ్ పుత్ వ‌ర్గీయులు డిమాండ్ చేస్తోన్నవిష‌యం విదిత‌మే. ఆ సినిమాను త‌మ రాష్ట్రాల్లో నిషేధిస్తున్నామ‌ని గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్, హ‌ర్యానా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా, ఆ సినిమాను ముస్లింలు చూడ‌వ‌ద్ద‌ని ఎంఐఎం అధ్య‌క్షుడు,  హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా ముస్లిం యువ‌త‌ ఆ సినిమాను చూసి త‌మ విలువైన స‌మ‌యాన్నివృథా చేసుకోవ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. అది ఒక చెత్త (బ‌క్వాస్) సినిమా అని, దాని కోసం స‌మ‌యం ,డ‌బ్బు వెచ్చించ‌డం దండ‌గ‌ని చెప్పారు. `షరియా సంరక్షణ` పేరిట వరంగల్ లో నిర్వ‌హించిన బహిరంగ సభలో అసద్ మాట్లాడుతూ అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

1540లో మాలిక్ మ‌హ‌మ్మ‌ద్ జ‌యాసి అనే ముస్లిం ర‌చ‌యిత రాసిన క‌ల్పిత న‌వ‌ల ఆధారంగా ‘పద్మావత్’ సినిమాను తెర‌కెక్కించార‌ని, ఆ న‌వ‌ల‌కు ఎటువంటి చారిత్ర‌క ఆధారాలు లేవ‌ని అస‌ద్ చెప్పారు. రాజ్ పుత్ రాణి పద్మావ‌తి దేవి, చ‌క్ర‌వ‌ర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి గొప్ప వ్య‌క్తుల‌ కథ అంటూ  ఆ చిత్రాన్ని నిర్మించార‌ని, అది కేవ‌లం కట్టుకథ అని అన్నారు. భ‌గ‌వంతుడు ఇచ్చిన జీవితాన్ని చిర‌కాలం గుర్తిండిపోయే మంచి పనులకు ఉప‌యోగించాల‌ని, ఇటువంటి చిత్రాల‌ను చూసి విలువైన స‌మ‌యం, డ‌బ్బు వేస్ట్ చేసుకోవ‌ద్ద‌ని సూచించారు.

ప్ర‌ధాని మోదీ...ఈ చిత్రం కోసం  12 మంది సభ్యులతో కమిటీని నియమించార‌ని, ఆ చిత్రం పై రివ్యూలు, స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయాల‌ని కోరార‌ని చెప్పారు. ఓ క‌ల్పిత క‌థ తో తీసిన సినిమాపై క‌మిటీ వేసిన మోదీ...ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో మాత్రం ముస్లిం పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌కుండానే నిర్ణ‌యం తీసుకోవ‌డం హాస్యాస్పద‌మ‌న్నారు. త‌మ రాణికి వ్యతిరేకంగా నిర్మించిన సినిమాపై నిషేధం విధించేందుకు రాజ్ పుత్ లు ఏక‌తాటిపైకి వ‌చ్చార‌ని, త‌మ వ‌ర్గానికి స‌మ‌స్య వ‌చ్చిన‌పుడు ఐక‌మ‌త్యంగా ఉండి ఎలా ఎదుర్కోవాలో వారు చూపించార‌ని అన్నారు.

రాజ్ పుత్ ల‌ను చూసి ముస్లింలు నేర్చుకోవాల‌ని.... కానీ, ముస్లింల‌కు వ్య‌తిరేకంగా బీజేపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోన్న విధానాలపై ప్ర‌శ్నించేందుకు ముస్లింలు ఒక్క‌తాటికిపైకి రాలేక‌పోతున్నార‌ని, ముస్లింల‌లో ఐక‌మ‌త్యం కొర‌వ‌డింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌తంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వీహెచ్ పీ నాయకుడు ప్రవీణ్ తొగాడియాకు కాంగ్రెస్ మద్ధతు ప‌ల‌క‌డాన్ని అస‌ద్ ఖండించారు. సెక్యుల‌ర్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోసం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంద‌ని మండిప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు