సూర్య మీద చెత్త వ్యాఖ్యలు.. వివాదంలో ఛానెల్

సూర్య మీద చెత్త వ్యాఖ్యలు.. వివాదంలో ఛానెల్

తమిళ స్టార్ హీరో సూర్య ఇంకొంచెం ఎత్తు ఉంటే బాగుండేదని అభిమానులు అనుకుంటూ ఉంటారు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్యకు కొంచెం ఎత్తు తక్కువగా ఉండటం మైనస్సే. అయినప్పటికీ ఆ లోపం కనిపించకుండా తన నటనతో మెస్మరైజ్ చేస్తుంటాడు సూర్య. అతడి కొత్త సినిమా ‘గ్యాంగ్’లో ఒక చోట ఈ ఎత్తు గురించి ఒక డైలాగ్ కూడా ఉంటుంది. సూర్య సీబీఐ ఆఫీస్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినపుడు అతడి ఎత్తు గురించి ఉన్నతాధికారి కామెంట్ చేస్తాడు. అందుకు బదులుగా.. ‘‘ఎంత ఎత్తున్నామన్నది కాదు ముఖ్యం. ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యం’’ అంటాడు. ఇది తన ఎత్తు గురించి కామెంట్ చేసే వాళ్లకు సూర్య ఇచ్చిన కౌంటర్‌గా భావించవచ్చు.

ఇదిలా ఉంటే.. సూర్య హైట్ గురించి తాజాగా సన్ మ్యూజిక్ ఛానెల్లో ఇద్దరు యాంకర్లు చెత్త వ్యాఖ్యానాలు చేయడం తమిళనాట దుమారం రేపుతోంది. సూర్యతో ‘వీడొక్కడే’.. ‘బ్రదర్స్’ సినిమాలు తీసిన కె.వి.ఆనంద్.. అతడితో కొత్తగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ఆనంద్ భావిస్తున్నాడని.. ఐతే ‘సింగం’ సినిమాలో తన కంటే ఎత్తున్న అనుష్కనే సూర్య తల ఎత్తి చూశాడని.. ఇక అమితాబ్ బచ్చన్‌తో సినిమా అంటే స్టూల్ వేసుకుని నటించాల్సి ఉంటుందని యాంకర్లు వెకిలిగా నవ్వుతూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య ఫ్యాన్స్ ఆ ఇద్దరు యాంకర్ల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విశాల్ లాంటి సెలబ్రెటీలు సైతం ఈ విషయమై స్పందించారు. యాంకర్లపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యతిరేకత చూశాక ఆ ఇద్దరు యాంకర్లు బయట తిరగడమే కష్టమయ్యేట్లుంది. ఈ దృశ్యాల్ని ప్రసారం చేసిన సన్ టీవీ ఛానెల్ మీద కూడా సూర్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు