నిషేధం లేదు.. ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు

నిషేధం లేదు.. ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు

రెండు మూడు నెలలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన చర్చ జరుగుతోంది ‘పద్మావతి’ సినిమా గురించి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాదిని ఒక్కో రాష్ట్రం ఈ చిత్రాన్ని నిషేధిస్తూ వస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్రంపై బ్యాన్ వేశాయి. మరి కొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ప్రచారం జరుగుతుండటంతో చిత్ర బృందం ఆందోళన చెందుతోంది. ఐతే ఇలాంటి సమయంలో వారికి గొప్ప ఊరటనిస్తూ సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది.

‘పద్మావత్’గా పేరు మార్చుకున్న ‘పద్మావతి’ సినిమాను రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ఇలాంటి నిషేధాలు చెల్లవని స్పష్టం చేసింది. సెన్సార్ పూర్తయిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదల చేయవచ్చని తేల్చి చెప్పింది. ఇది ‘పద్మావత్’ చిత్ర బృందానికి గొప్ప ఊరటే. ఈ నెల 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. అవసరమైతే థియేటర్ల దగ్గర భద్రత కూడా కల్పించాలి. అటు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ వచ్చేసింది. ఏ రాష్ట్రమూ సినిమాను నిషేధించేందుకు ఆస్కారం లేకపోయింది. ఇక రిలీజ్ టైంలో కర్ణిసేన కూడా కొంచెం శాంతిస్తే ‘పద్మావత్’ సినిమా ప్రదర్శన ప్రశాంతంగా సాగిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు