బంగారం బదులు ‘జైసింహా’ అట

బంగారం బదులు ‘జైసింహా’ అట

సంక్రాంతి సీజన్లో ముందుగా రిలీజైన ‘అజ్ఞాతవాసి’ తేలిపోయింది. ‘జై సింహా’ అయినా అడ్వాంటేజీని ఉపయోగించుకుంటుందని అనుకుంటే అదీ జరగలేదు. ఈ సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చింది. ఐతే చిత్ర బృందం మాత్రం ప్రచారం విషయంలో తగ్గట్లేదు. సంక్రాంతి విజేత ఈ సినిమానే అంటూ ప్రచారం చేసుకుంటోంది. ఈ సినిమా 80లు.. 90ల నాటిది లాగా ఉందంటూ కామెంట్స్ వినిపించగా.. పబ్లిసిటీ సైతం అదే తరహాలో సాగుతుండటం గమనార్హం.

‘‘సంక్రాంతి పండక్కి కూతుళ్లకి, కోడళ్లకి బంగారం కొని పెట్టడం మన ఆనవాయితి. కానీ ఈసారి పండక్కి ‘జై సింహా’ సినిమాని వాళ్లకి చూపించండి. బంగారం లాంటి సినిమా చూపించారు, ఇక మాకు బంగారం ఎందుకు అనకపోతే మీ టికెట్ డబ్బులకి మాది గ్యారెంటీ’’ అంటూ పోస్టర్ వదలడం విశేషం. ఈ ప్రచారం జనాల్ని 80లు.. 90ల్లోకే తీసుకెళ్తోంది. అప్పట్లోనే ఇలాంటి ప్రచారాలుండేవి. అయినా బంగారం బదులు ‘జై సింహా’ సినిమా అనడమే ఇక్కడ విడ్డూరం.

ఐతే ‘జై సింహా’ టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు పర్వాలేదు. ‘అజ్ఞాతవాసి’కి మరీ దారుణమైన టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. సూర్య సినిమా ‘గ్యాంగ్’కు టాక్ బాగున్నప్పటికీ అది క్లాస్ సినిమా కావడం.. ‘రంగుల రాట్నం’కు కూడా యావరేజ్ టాక్ రావడంతో మాస్ ప్రేక్షకులకు ‘జై సింహా’నే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. బి, సి సెంటర్లలో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ఈ చిత్రం ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా రావడానికి అవకాశాలు లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు