తెలుగు ప్రేక్షకులకు ఇంతకంటే షాక్ ఉండదు

తెలుగు ప్రేక్షకులకు ఇంతకంటే షాక్ ఉండదు

పోయినేడాది సంక్రాంతికి మూడు సినిమాలొచ్చాయి. అందులో ‘ఖైదీ నంబర్ 150’.. ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్లయ్యాయి. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. ఇక అంతకుముందు ఏడాది నాలుగు సినిమాలు రిలీజైతే అందులో ‘సోగ్గాడే చిన్నినాయనా’ బ్లాక్ బస్టర్ అయింది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సూపర్ హిట్ కాగా.. ‘నాన్నకు ప్రేమతో’ హిట్‌గా నిలిచింది. ‘డిక్టేటర్’ ఓ మోస్తరుగా ఆడింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా అన్నింటికీ మంచి వసూళ్లు వస్తాయని.. ఎలాంటి సినిమా అయినా బాగానే ఆడేస్తుందన్న భరోసా కలిగింది గత రెండేళ్లలో. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందడి ఓ రేంజిలో ఉంటుందని అంచనా వేశారంతా. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.

ఫ్లాప్ అవడానికి ఏమాత్రం అవకాశం లేదనుకున్న ‘అజ్ఞాతవాసి’ దారుణమైన ఫలితాన్నందుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాకే. దీని ధాటికి మిగతా సినిమాలు తట్టుకోగలవా అనుకున్నారంతా. కానీ పరిస్థితి తలకిందులైంది. ‘జై సింహా’పై ముందు నుంచి అంచనాలు తక్కువే కానీ.. ‘అజ్ఞాతవాసి’ తేలిపోయిన నేపథ్యంలో ఇది అందుకుంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా అంతంతమాత్రమే అని తేలిపోయింది. తమిళ డబ్బింగ్ మూవీ ‘గ్యాంగ్’కు టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు.

ఇక సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన ‘రంగుల రాట్నం’ కూడా అడ్వాంటేజీని ఉపయోగించుకునే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. మిగతా సినిమాల ఫెయిల్యూర్‌ను ఇది వాడుకోవడం కష్టమే అనిపిస్తోంది. మొత్తానికి 2018 సంక్రాంతి సినిమాల విషయంలో ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగింది. ఈ సంక్రాంతి తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు