రెజీనా నిజాయితీగా ఒప్పేసుకుంది

 రెజీనా నిజాయితీగా ఒప్పేసుకుంది

‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాలతో రెండేళ్ల కిందట మంచి ఊపు మీద కనిపించింది రెజీనా కసాండ్రా. అందం, అభినయం రెండూ ఉండటంతో ఆమె ఇంకా పెద్ద స్థాయి హీరోయిన్ అవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో రెజీనా కెరీర్ తిరగబడింది. వరుస ఫ్లాపులతో రెండేళ్లు తిరిగేసరికి టాలీవుడ్ నుంచి అంతర్ధానమైపోయే స్థితికి చేరుకుందామె.

ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నవి ఒకటో రెండో సినిమాలు. గత ఏడాది తెలుగులో రెజీనా నటించిన రెండు సినిమాలు దారుణమైన ఫలితాన్నిచ్చాయి. ‘నక్షత్రం’.. ‘బాలకృష్ణుడు’ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపయ్యాయి. ఈ నేపథ్యంలో 2017 సంవత్సరం తనకు అస్సలు కలిసి రాలేదంటూ నిజాయితీగా చెప్పింది రెజీనా.

2017 తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని ఆశించానని.. కానీ తన ఆశ నెరవేరలేదని రెజీనా చెప్పింది. తమిళంలో చేసిన ‘నగరం’ మాత్రం మంచి ఫలితాన్నే అందించిందని.. తెలుగులో మాత్రం గత ఏడాది ఏమాత్రం కలిసి రాలేదని రెజీనా చెప్పింది. ఐతే 2018లో మాత్రం మంచి ఫలితాలనుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. నాని నిర్మాణంలో చేస్తున్న ‘అ’లో తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేసినట్లు ఆమె తెలిపింది.

ఇందులో తాను కాఫీ షాప్‌లో పని చేసే అమ్మాయిగా కనిపిస్తానని.. ఆ పాత్ర మాదక ద్రవ్యాలకు బానిస అని ఆమె చెప్పింది. ఇలాంటి పాత్ర కెరీర్లో ఎప్పుడూ చేయలేదని.. డిఫరెంట్ హేర్ స్టైల్, మేకప్‌తో చాలా కొత్తగా కనిపిస్తానని.. ప్రేక్షకులను తన పాత్ర థ్రిల్ చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు