రీమేక్.. చేయనంటే చేయనంటున్న బాలయ్య

రీమేక్.. చేయనంటే చేయనంటున్న బాలయ్య

తెలుగులో కొందరు హీరోలు అస్సలు రీమేక్‌ల జోలికి వెళ్లరు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మహేష్ బాబుదే. హీరో అయ్యాక ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రీమేక్‌లో నటించలేదు మహేష్. రీమేక్ అనగానే తనకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగదని.. కాబట్టి ఎప్పటికీ రీమేక్ చేయనని అని చాలాసార్లు కుండబద్దలు కొట్టాడు మహేష్. ఇక సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా రీమేక్‌ల పట్ల విముఖత చూపిస్తుంటాడు. ఆయన కెరీర్లో రీమేక్‌లు చాలా చాలా తక్కువ. అప్పుడెప్పుడో హిందీలో విజయవంతమైన ‘కర్జ్’ ఆధారంగా ‘ఆత్మబలం’ అనే సినిమా చేశాడు. అదేమంత బాగా ఆడలేదు. ఆ తర్వాత ఇంకేవో ఒకటి రెండు రీమేక్‌లు ట్రై చేశాడు.

చివరగా బాలయ్య చేసిన రీమేక్ ‘లక్ష్మీనరసింహా’. అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తన కొత్త సినిమా ‘జై సింహా’ కోసం ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూలో భాగంగా రీమేక్‌ల విషయంలో బాలయ్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘జై సింహా’ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఎనిమిదేళ్ల కిందటే తనతో సినిమా చేస్తానని వచ్చినట్లు బాలయ్య వెల్లడించాడు.

అప్పుడాయన తనకు ఒక రీమేక్ సినిమా సజెస్ట్ చేశాడని.. కానీ రీమేక్ చేయడం ఇష్టం లేక తాను ఆ సినిమా ఒప్పుకోలేదని బాలయ్య వెల్లడించాడు. రీమేక్ సినిమా చేస్తే.. క్రెడిట్ మొత్తం ఒరిజినల్ హీరోకే వెళ్తుందని.. మనదేమీ ఉండదని.. పైగా తాను ఇంతకుముందు చేసిన రీమేక్ సినిమాలు ఆశించిన ఫలితాలివ్వలేదని.. అందుకే కె.ఎస్‌కు నో చెప్పానని బాలయ్య వెల్లడించాడు. ఇక గత ఏడాది రవికుమార్ తనకు ‘జై సింహా’ కథ చెప్పగానే నచ్చేసి ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పానని బాలయ్య వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు