‘ఆర్ఆర్ఆర్’ అనుకున్నట్లే వచ్చేస్తుందా?

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మరోసారి పెద్ద సినిమాల మేకింగ్ ఆలస్యమైంది. విడుదల వాయిదా పడటం అనివార్యమైంది. ఓ మోస్తరు స్థాయి సినిమాలనే వాయిదా వేయక తప్పలేదు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎలా ఉంటారనే అంతా అనుకున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయిన రాజమౌళి మామూలు పరిస్థితుల్లోనే డెడ్ లైన్లు అందుకోవడం కష్టం.

అలాంటిది అక్టోబరు 13న డేట్ ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తుండగా దాదాపు మూడు నెలలు షూటింగ్ ఆగిపోతే ఇక ఆ డేట్‌ను అందుకోవడం అసాధ్యం అనే అనుకున్నారంతా. వచ్చే సంక్రాంతికో లేదంటే వేసవికో ‘ఆర్ఆర్ఆర్’ చూసుకోవాల్సిందే అని ఫిక్సయిపోయారు. కానీ ఈ మధ్య ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. అక్టోబరు 13నే తమ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా కూడా జనాలకు దీనిపై నమ్మకం కలగలేదు.

కానీ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి వచ్చిన షూటింగ్ అప్‌డేట్ చూస్తే అక్టోబరు 13నే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమనే అనిపిస్తోంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్లుగా తాజాగా ప్రకటించిన నేపథ్యంలో డెడ్ లైన్ అందుకోవడం కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్, చరణ్ రెండు భాషల్లో తమ పాత్రలకు డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు అప్‌డేట్ ఇవ్వడం కీలకమైన విషయం. దీన్ని బట్టి షూటింగ్ లేని రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగానే సాగాయన్నమాట.

ఇప్పటివరకు షూటింగ్ పూర్తయినంత వరకు డబ్బింగ్, ఎడిటింగ్ చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది, ఇప్పుడు దొరికిన ఖాళీలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా చాలా వరకు కానిచ్చేసి ఉండొచ్చు. అదే నిజమైతే మిగతా రెండు పాటల చిత్రీకరణను జులైలో పూర్తి చేసి.. ఇంకో మూడు నెలల్లోపు సినిమాను విడుదలకు సిద్ధం చేయడం కష్టం కాకపోవచ్చు. కాకపోతే కరోనా కరుణించాలి. దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడవాలి. ఆ పరిస్థితుల్లోనే ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబరు 13న విడుదల కావడానికి ఛాన్సుంది.