అసలు సిసలు మోహన్ బాబు.. ఈసారైనా

అసలు సిసలు మోహన్ బాబు.. ఈసారైనా

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన నట కౌశలం గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా.. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలెన్నింటినో పండించారాయన. ఐతే గత రెండు దశాబ్దాల నుంచి మోహన్ బాబు జోరు తగ్గించేశారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు చేసిన సినిమాల్ని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. తన పిల్లలు సినిమాల్లోకి వచ్చాక ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. చివరగా ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే కామెడీ సినిమాలో నటించారు మోహన్ బాబు. ఆ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఈ విలక్షణ నటుడు హీరోగా ‘గాయత్రి’ అనే సినిమా తెరకెక్కింది.

ఈ రోజు ఈ చిత్ర టీజర్ రిలీజైంది. సినిమాలో మోహన్ బాబుది వన్ మ్యాన్ షో అనిపిస్తోంది ఈ టీజర్ చూస్తుంటే. మోహన్ బాబు తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ ఈ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. సినిమాలో వేరే పాత్రలు కూడా ఉన్నప్పటికీ మోహన్ బాబే ప్రధాన ఆకర్షణ అయ్యేలా ఉన్నారు. ఆయన స్థాయికి తగ్గ పవర్ ఫుల్ రోల్ పడ్డట్లుంది. మోహన్ బాబు లాంటి నటుడికి సరైన క్యారెక్టర్ పడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. మోహన్ బాబు ఒకప్పటి స్థాయిలో చెలరేగి నటించి చాలా కాలం అయిపోతోంది. ఈ జనరేషన్ ప్రేక్షకులకు ఆయన గొప్పదనం తెలియదు. ఐతే ‘గాయత్రి’ సినిమాతో వాళ్లందరికీ కూడా ఆయన స్థాయి ఏంటో తెలుస్తుందని మంచు ఫ్యామిలీ ఆశిస్తోంది. మరి ఫిబ్రవరి 9న మోహన్ బాబు తన నట విశ్వరూపాన్ని చూపిస్తారేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు