రిలీజ్ డేట్ ఇచ్చారు కానీ.. భయం భయమే

రిలీజ్ డేట్ ఇచ్చారు కానీ.. భయం భయమే

‘పద్మావత్’గా పేరు మార్చుకున్న ‘పద్మావతి’ సినిమా ఈ నెల 25కు రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఒక పెద్ద సినిమా రిలీజవుతోందంటే.. కనీసం నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్ హడావుడి మొదలవుతుంది. కానీ ‘పద్మావత్’ చిత్ర బృందం మాత్రం అలా హడావుడి ఏమీ చేయట్లేదు. ఇందుక్కారణం ఈ చిత్రంతో ముడిపడ్డ వివాదాలే. ఇప్పటికే ఈ సినిమాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఒకసారి సినిమా వాయిదా పడింది కూడా.

ఇప్పుడు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో విడుదలకు మార్గం సుగమమైనట్లే అనుకున్నారు. కానీ సెన్సార్ బోర్డు మార్పులు చేర్పులతో సర్టిఫికెట్ జారీ చేశాక కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తున్ను కర్ణి సేన వాళ్లు తగ్గట్లేదు. సినిమాను విడుదల కానివ్వమని.. థియేటర్లను తగులబెడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వమంటూ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ సైతం ఇదే బాట పట్టింది. ఉత్తరాదిన ఇంకొన్ని రాష్ట్రాలు ఈ బాట పడతాయంటున్నారు.

ఇలా రాష్ట్రాలకు రాష్ట్రాలు ఎర్ర జెండా చూపిస్తే సినిమా ఇంకెక్కడ రిలీజవ్వాలి? హిందీ సినిమాల మార్కెట్ అంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే అన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్సాలీ తల పట్టుకుంటున్నాడు. రిలీజ్ డేట్ అయితే ఇచ్చాం కానీ.. సినిమా సజావుగా రిలీజవుతుందో లేదో అన్న భయం అతడిని వెంటాడుతోంది. అందుకే ప్రమోషన్ల ఊసే ఎత్తకుండా టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఈ సినిమాపై నెలకొన్న వివాదాలు చూశాక ఇకపై భవిష్యత్తులో బన్సాలీ ఇలాంటి కథతో సినిమా తీసే సాహసమే చేయకపోవచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు