తమిళంలో 8 రోజులు.. తెలుగులో ఆరేనట

తమిళంలో 8 రోజులు.. తెలుగులో ఆరేనట

స్వతహాగా తమిళుడైనప్పటికీ సూర్యను మన హీరో లాగే చూస్తారు తెలుగు ప్రేక్షకులు. ‘గజిని’ నుంచి ‘24’ వరకు సూర్య నటించిన అనేక సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాయి. కొన్ని సినిమాలు తమిళంలో మాదిరే ఇక్కడా ఆదరణ పొందాయి. అందుకే తన సినిమాల తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంటాడు సూర్య. డైరెక్ట్ తెలుగు సినిమా అనే భావన కలిగించేలా మార్పులు చేర్పులు చేయిస్తుంటాడు. ఇంతకుముందు ‘బ్రదర్స్’ సినిమాలో తాను చేసిన రెండు పాత్రల్లో ఒకదానికి సూర్య డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు ‘గ్యాంగ్’ సినిమాలో తన పాత్రకు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు.

ఐతే తనకు తెలుగు సరిగా రాకపోయినా డబ్బింగ్ విషయంలో అంత ఇబ్బందేమీ పడలేదని సూర్య చెప్పాడు. ‘గ్యాంగ్’ తమిళ వెర్షన్ డబ్బింగ్ పూర్తి చేయడానికి తనకు ఎనిమిది రోజులు పట్టిందని.. కానీ ఆశ్చర్యకరంగా తెలుగు డబ్బింగ్ మాత్రం ఆరు రోజుల్లోనే పూర్తి చేసేశానని సూర్య తెలిపాడు. మాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి సపోర్ట్ ఉండటం వల్లే అంత సులువుగా ఆ పని పూర్తయిందని.. తెలుగులో డబ్బింగ్ చెప్పడాన్ని తానెంతగానో ఆస్వాదించానని సూర్య చెప్పాడు. తెలుగు భాష అంత మధురమైందని ఎందుకంటారో తనకు ఇప్పుడే తెలిసిందని సూర్య చెప్పాడు. తన తమిళ స్లాంగ్ అక్కడక్కడా కొంచెం ఇబ్బంది పెట్టొచ్చని.. తెలుగు ప్రేక్షకులు అందుకు తనను మన్నించాలని సూర్య కోరాడు. ‘గ్యాంగ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు