ఇంతకీ పవన్ ఎంత తేవాలి?

ఇంతకీ పవన్ ఎంత తేవాలి?

ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి విపరీతమైన ప్రి రిలీజ్ బజ్ వచ్చింది. రిలీజ్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ ప్రతి థియేటర్లో కనీసం ఐదు షోలు పడబోతున్నాయి. యుఎస్‌లో ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కాని స్థాయిలో దీన్ని విడుదల చేస్తున్నారు. కాబట్టి టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇక టాక్ పాజిటివ్‌గా వస్తే మోత మోగిపోతుంది.

అసలింతకీ ‘అజ్ఞాతవాసి’ అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయి.. ఈ చిత్రం ఎంత షేర్ తెస్తే బ్రేక్ ఈవెన్‌కు వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటిదాకా ‘బాహుబలి’ రెండు భాగాలకు మినహాయిస్తే అత్యధిక బిజినెస్ జరిగిన తెలుగు సినిమా ఇదే. ‘అజ్ఞాతవాసి’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని రూ.125 కోట్లకు అమ్మడం విశేషం. తెలుగు రాష్ట్రాల వరకే బిజినెస్ రూ.92 కోట్లు దాటింది. నైజాం రైట్స్ మాత్రమే రూ.29 కోట్లు పలికాయి. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి 63 కోట్లకు బిజినెస్ జరగడం విశేషం. కర్ణాటక హక్కులు దాదాపు రూ.11 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.19.5 కోట్లకు అమ్మారు. ఇలా ‘అజ్ఞాతవాసి’కి అన్ని ఏరియాల్లోనూ నాన్-బాహుబలి రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల షేర్ సాధిస్తేనే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది. అదే జరిగితే ఆటోమేటిగ్గా నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలైపోతాయి. రూ.105 కోట్ల షేర్‌తో ‘ఖైదీ నంబర్ 150’ నాన్-బాహుబలి రికార్డుతో కొనసాగుతోంది. దాన్ని ‘అజ్ఞాతవాసి’ బద్దలు కొట్టడం లాంఛనమే కావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు