క్లీనర్ టు డ్యాన్సర్.. వయా రజినీకాంత్

క్లీనర్ టు డ్యాన్సర్.. వయా రజినీకాంత్

కొరియోగ్రాఫర్ టర్న్డ్ హీరో టర్న్డ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ చాలా కింది స్థాయి నుంచి వచ్చాడన్న సంగతి తెలిసిందే. చాలా పేద కుటుంబంలో పుట్టి లారీ క్లీనర్‌గా కూడా పని చేసిన గతం అతడిది. అలాంటి స్థితి నుంచి డ్యాన్స్ మాస్టర్, హీరో, డైరెక్టర్ కావడమంటే మాటలు కాదు. ఇదంతా సూపర్ స్టార్ రజినీకాంత్ పుణ్యమే అని గతంలోనే చెప్పాడు లారెన్స్. తాజాగా రజినీకాంత్ పెట్టబోయే కొత్త పార్టీలో తాను చేరబోతున్నట్లు.. ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన సందర్భంగా.. రజినీ తనకెలా లైఫ్ ఇచ్చింది వివరించాడు లారెన్స్.

లారీ క్లీనర్‌గా పని చేస్తున్నపుడే తనకు డ్యాన్స్ అంటే పిచ్చి ఉండేదని.. రకరకాల పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసి.. డ్యాన్స్ మాస్టర్ల దగ్గర అవకాశాల కోసం తిరిగే వాడినని.. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని లారెన్స్ చెప్పాడు. ఐతే ఒక రోజు అనుకోకుండా రజినీకాంత్ ముందు డ్యాన్స్ చేసే అవకాశం తనకు వచ్చిందని.. ఆయన తన డ్యాన్స్ చూశాక ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడని.. కానీ రెండు రోజుల తర్వాత తనకు ఫోన్ ద్వారా తనను సంప్రదించి.. తాను రెకమండ్ చేస్తానని, ప్రభుదేవా గ్రూప్‌లోకి వెళ్లి చేరమని చెప్పాడని లారెన్స్ వెల్లడించాడు.

తర్వాత ప్రభుదేవాను కలిస్తే.. రజినీ సార్ చెప్పారు నా గ్రూప్ ఒకదాంట్లో చేరిపో అని అవకాశమిచ్చాడని.. ఆ తర్వాత తనకంటూ డ్యాన్సర్‌గా గుర్తింపు వచ్చి.. డ్యాన్స్ మాస్టర్ అయ్యానని.. ఆపై ఊహించని స్థాయికి చేరుకున్నానని లారెన్స్ చెప్పాడు. అందుకే తనకు రజినీ దేవుడితో సమానమని.. ఆయన బాటలోనే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నానని లారెన్స్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు