దడ దర్శకుడు ఇప్పుడేం చేస్తాడో?

దడ దర్శకుడు ఇప్పుడేం చేస్తాడో?

నాగ చైతన్య కెరీర్ లో.. చైతు కూడా మరచిపోవాలని భావించే మూవీ దడ. టెక్నికల్ వావ్ అనిపించుకున్న ఈ చిత్రానికి.. వసూళ్లు కానీ.. ఆదరణ కానీ ఏ మాత్రం దక్కలేదు. బడ్జెట్ భారీగానే పెట్టినా వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువ. అయితే.. దర్శకుడి మేకింగ్ స్టైల్ కు మాత్రం గుర్తింపు లభించింది. అజయ్ భుయాన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాగా.. దడ తర్వాత తను బాలీవుడ్ మూవీ చేయబోతున్నట్లు అప్పట్లో చెప్పాడు.

అయితే.. ఆ బాలీవుడ్ ప్రాజెక్టు ఏమయిందో తెలియలేదు కానీ.. ఇప్పుడీ డైరెక్టర్ సోషల్ మీడియాలో సత్తా చాటబోతున్నాడు. తెలుగులో అత్యంత భారీ క్యాస్టింగ్ తో.. అతి ఎక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న వెబ్ సిరీస్ గా ఈ ప్రాజెక్టు రికార్డ్ సృష్టించబోతోంది. జగపతి బాబు.. పోసాని కృష్ణ మురళి.. హరితేజ వంటి క్రేజీ ఫిలిం యాక్టర్స్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తుండడం విశేషమే. ఇంతమందిని ఒక్క ప్రాజెక్టులోకి తీసుకురాగలిగాడంటే.. నిజంగానే దర్శకుడి ప్రతిభను పొగడాలి.

గుంటూరు టాకీస్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ వెబ్ సిరీస్ అంతా ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. హీరో ఓ సెలబ్రిటీ మేనేజర్ రోల్ లో కనిపిస్తాడట. నిజానికి ఈ సబ్జెక్టును మొదట సినిమాగా చేయాలని భావించి.. చివరకు వెబ్ సిరీస్ గా మార్చారని తెలుస్తోంది. మరి దర్శకుడిగా సక్సెస్ కాలేక దడ పుట్టించిన అజయ్ భుయాన్.. ఈ వెబ్ సిరీస్ ను ఎంతమాత్రం రక్తి కట్టిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు