మహేష్ కత్తికి కౌంటర్ ఇచ్చిందెవరు?

మహేష్ కత్తికి కౌంటర్ ఇచ్చిందెవరు?

వివేక్ కృష్ణ.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నోళ్లలో బాగా నానుతున్న పేరు. పవన్ కళ్యాణ్ మీద.. పవన్ అభిమానుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ బ్రేక్ లేకుండా సాగిపోతున్న మహేష్ కత్తికి ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా కళ్లెం వేసింది వివేకే. కత్తిని తల్లి గురించి మాట్లాడమని అడగడం ద్వారా అతడి నోరు పెగలకుండా చేశాడు వివేక్. ఇంతకుముందు కత్తిని ఎదుర్కొన్న వాళ్లందరూ అతడిని దూషించడం ద్వారా ఆయుధాన్నిచ్చారు. ఆత్మరక్షణలో పడ్డారు. కానీ వివేక్ మాత్రం చాలా సంయమనంతో, మర్యాదగా మాట్లాడుతూ.. పాయింట్ పట్టుకుని కత్తినే ఆత్మరక్షణలోకి నెట్టాడు. అతను టీవీ ఛానెల్ చర్చ నుంచి లేచి వెళ్లిపోయేలా చేశాడు.

ఈ నేపథ్యంలో వివేక్‌ను పవన్ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఎవరీ వివేక్ అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఈ చర్చలో తాను ఒక డైరెక్టర్ అని, రైటర్ అని చెప్పుకున్నాడు వివేక్. అతను రామ్ గోపాల్ వర్మ శిష్యుడనే విషయం చాలామందికి తెలియదు. వర్మ నిర్మాణంలో నాగచైతన్య హీరోగా ‘బెజవాడ’ అనే సినిమా కూడా తీశాడతను. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో అతడి పేరు జనాలు గుర్తుంచుకోలేదు. ఆ సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లవుతోంది. ఇంత కాలానికి మళ్లీ ఇలా ఫేమస్ అయ్యాడు. తన శిష్యుడిని పొగుడుతూ వర్మ సైతం ట్విట్టర్లో తనదైన శైలిలో పొగడ్తలు గుప్పించాడు. తాను ఇప్పుడు వివేక్ అసిస్టెంటుగా చేరాలనుకుంటున్నట్లు చెప్పాడు. వివేక్ చాలా టాలెంటెడ్ అని.. తన జోక్యం వల్లే ‘బెజవాడ’ సినిమా పోయిందని వర్మ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు