పద్మావతి ఫిట్టింగ్ పెట్టేసింది

పద్మావతి ఫిట్టింగ్ పెట్టేసింది

‘పద్మావత్’గా మారిన ‘పద్మావతి’ సినిమా ఎప్పుడో డిసెంబరు 1నే విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమా చుట్టూ పెద్ద వివాదాలు ముసురుకోవడం.. సెన్సార్ దగ్గర కూడా సమస్యలు తలెత్తడంతో వాయిదా పడిపోయింది. ఒక దశలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ఇక ఎప్పటికీ ఈ సినిమా విడుదల కాలేదేమో అన్న సందేహాలు కూడా కలిగాయి.

ఐతే కొన్ని రోజులు వార్తల్లోనే లేకుండా పోయిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. జనవరి 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సంజయ్ లీలా బన్సాలీ. ఐతే ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి ఘనంగా ప్రకటించి.. ప్రమోషన్లు గట్టిగా చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సెన్సార్ అయ్యాక.. మార్పులు చేర్పులు.. కోతలు జరిగాక కూడా కర్ణిసేన ఈ చిత్రాన్ని అడ్డుకుంటామనే అంటోంది.

ఇదిలా ఉంటే ‘పద్మావత్’ను జనవరి 25కు ఫిక్స్ చేయడంతో రిపబ్లిక్ డే వీకెండ్ కోసం ఇప్పటికే షెడ్యూల్ అయిన సినిమాలకు ఇబ్బంది తప్పట్లేదు. జనవరి 26న అక్షయ్ కుమార్ సినిమా ‘ప్యాడ్ మ్యాన్’తో పాటు సిద్దార్థ్ మల్హోత్రా-రకుల్ ప్రీత్ జంటగా నీరజ్ పాండే రూపొందించిన ‘అయ్యారీ’ కూడా విడుదల కావాల్సి ఉన్నాయి. ఇవి ఎప్పుడో రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. బాలీవుడ్లో అప్పటికప్పుడు రిలీజ్ డేట్లు ఖరారు చేసుకోవడం ఉండదు. ముందుగా నిర్మాతల మండలి దగ్గర రిలీజ్ డేట్ చెప్పి బెర్తు బుక్ చేసుకోవాలి. కానీ ‘పద్మావత్’ విషయం వేరు. అది అనేక వివాదాల నేపథ్యంలో డేట్ మార్చుకుని.. దగ్గర్లో దొరికిన మంచి డేట్ చూసుకుంది. బన్సాలీ ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ చేశాడు. ఇప్పుడు సినిమా విడుదల కావడమే కష్టంగా ఉంది కాబట్టి.. ఆయన కోరుకున్న డేట్ ఇచ్చేయాలి.

ఎన్ని వివాదాలున్నప్పటికీ ‘పద్మావత్’పై భారీ అంచనాలుున్నాయి. దీనికి పోటీ వెళ్లడం కూడా కష్టమే. కానీ జనవరి దాటితో రెండు నెలల పాటు అన్ సీజన్. సినిమాలు సరిగా ఆడవు. ఈ నేపథ్యంలో ‘ప్యాడ్ మ్యాన్’.. ‘అయ్యారీ’ సినిమాలకు ఇబ్బంది తప్పదు. ‘పద్మావత్’ వల్ల దక్షిణాదిన రిపబ్లిక్ డే వీకెండ్లో విడుదలయ్యే సినిమాలకు కూడా కొంత ఇబ్బంది తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు