అన్నయ్యని ఫాలో అవుతున్న పవన్‌

అన్నయ్యని ఫాలో అవుతున్న పవన్‌

పవన్‌కళ్యాణ్‌పై ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వాటిని వడ్డీతో పాటు తిరిగిచ్చేయడం అతనికి అలవాటు. చిరంజీవి మెతక స్వభావి అయినా కానీ పవన్‌ మాత్రం ఎవరిపై విమర్శలు చేయడానికైనా, ఎవరి విమర్శలని తిప్పి కొట్టడానికైనా జంకేవాడు కాదు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసినపుడే కాకుండా జనసేన ఆవిర్భావం తర్వాత కూడా పవన్‌ అదే ధోరణి కొనసాగించాడు. అయితే ఎవరిపై స్పందించాలి, ఎవరిని సీరియస్‌గా తీసుకోవాలనే దానిపై పవన్‌కి పూర్తి అవగాహన వున్నట్టుంది. రాజకీయంగా ముఖ్యమైన వాళ్లు చేసే విమర్శలకి మాత్రమే పవన్‌ స్పందిస్తున్నాడు.

అలాగే ఎంతో కొంత పబ్లిక్‌ ఇమేజ్‌ వున్న ఆర్టిస్టులు చేసిన విమర్శలకి కూడా పవన్‌ లోగడ స్పందించాడు. అయితే వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ విషయంలో మాత్రం పవన్‌ తన అన్నయ్య రూట్‌నే ఫాలో అవుతున్నాడు. ఎవరైనా తమ కంటే చిన్న వ్యక్తి చేసిన విమర్శలని సీరియస్‌గా తీసుకుని స్పందిస్తే వాళ్లని తమంతట తామే పెద్దవాళ్లని చేసినట్టు అనేది చిరంజీవి ఆలోచనా తీరు. కత్తి మహేష్‌ ఏం చేస్తున్నాడనేది పవన్‌కి తెలియకుండా లేదు. ఏ న్యూస్‌ చానల్‌ చూసినా అదే సుత్తి కనుక కచ్చితంగా పవన్‌ దృష్టిలోకి వెళ్లే వుంటుంది.

అయితే అతనెన్ని మాట్లాడినా, మీడియా అతడిని ఎంకరేజ్‌ చేసినా కానీ పవన్‌ స్పందించనంత వరకు అది వన్‌సైడ్‌ ఘోషే. పవన్‌ స్పందించినట్టయితే దీనిని రచ్చ చేసి మీడియా మరింత హల్‌చల్‌ చేసేస్తుంది. ప్రజారాజ్యం పార్టీ పుట్టినపుడు దానిని తొక్కేయడంలో మీడియా పాత్ర ఏమిటో స్వయంగా చూసిన పవన్‌కి ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయాలు తెలీకుండా లేవు. అందుకే సైలెంట్‌గా వుంటూ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, తన తరఫునుంచి ఎవరూ దీనిపై స్పందించకుండా జాగ్రత్త పడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు