తెలంగాణ‌లో పాద‌యాత్రల‌ రాజ‌కీయం ఫ‌లిస్తుందా?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు పాద‌యాత్ర‌ల జ‌పం సాగుతోంది. కీల‌క‌మైన పార్టీలు స‌హా.. ఇంకా పురుడు కూడా పోసుకోని.. పార్టీ కూడా పాద‌యాత్ర చేసేందుకు రెడీ అవుతోంది. మ‌రి ఈ పాద‌యాత్ర‌ల అంతిమ ల‌క్ష్యం అధికార‌మేన‌న్న విష‌యం ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి ఇది మేర‌కు స‌క్సెస్ అవుతుంది? మాట‌ల మాంత్రికుడుగా పేరున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందు ఈ పాద‌యాత్ర‌లు ఏమేర‌కు ఆయా పార్టీల‌కు స‌త్ఫ‌లిస్తాయి? అనేది కీల‌క చ‌ర్చ‌గా మారింది. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగిన 2018కి ముందు కానీ, త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కానీ.. ఎవ‌రూ పాద‌యాత్ర‌ల జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా యాత్ర‌లు చేయ‌డం ద్వారా.. అధికార పార్టీకి చెక్ పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర సార‌థి.. బండి సంజ‌య్ అంద‌రిక‌న్నా ముందున్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టబోతున్నా రు. వచ్చే నెలాఖరులో ఈ యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సంజయ్‌ పాదయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ రూపొందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది అని పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఒక‌రు అప్పుడే మీడియాకు లీకులు ఇచ్చారు. ఇక‌, కాంగ్రెస్‌కు కొత్త‌సార‌థ్యం వ‌హించ‌నున్న రేవంత్‌రెడ్డి కూడా పాద‌యాత్ర దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

గ‌తంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర ఫార్ములాను ఎంచుకున్నారు. అయితే.. అప్ప‌టి ప‌రిస్థితులు వేరు.కానీ, ఇప్పుడు ఇదే ఫార్ములాను అనుస‌రించేందుకు రేవంత్ రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే దీనిపై ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఇంకా.. పార్టీ పేరును అధికారికంగా కూడా ప్ర‌క‌టించ‌ని వైఎస్ త‌న‌య‌..ష‌ర్మిల కూడా త్వ‌ర‌లోనే తండ్రి బాట‌లో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఇలా మొత్తంగా ముగ్గురు నేత‌లు.. పాద‌యాత్ర రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నారు. మ‌రి ఈ రాజ‌కీయాలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయి? అనేది ప్ర‌శ్న‌గా మారింది.

ఇక‌, ప్ర‌స్తుతం కేసీఆర్ విష‌యాన్ని చూస్తే.. చిన్న‌పాటి లోపాలు త‌ప్ప‌.. ఆయ‌న‌పై పెద్ద‌గా వ్య‌తిరేక‌త క‌నిపించ‌డం లేద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా గ్రామీణ రాజ‌కీయాల్లో కేసీఆర్‌కు ఇప్ప‌టికీ బ‌ల‌మైన ప‌ట్టుంది. రైతు బంధు ద్వారా.. ఆయ‌న‌కు రైతుల నుంచి మంచి మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో తెలంగాణ సార‌థిగా, ఉద్య‌మ నేత‌గా ఆయ‌న‌కు తిరుగులేని ఆధిప‌త్యం క‌నిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు పాద‌యాత్ర‌ల‌కు రెడీ అవుతున్న‌ ముగ్గురి విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. వీరికి ఉద్య‌మ నేప‌థ్యంలో లేదు. తెలంగాణ కోసం ఉద్య‌మం సాగిన‌ప్పుడు.. బండి సంజ‌య్‌కానీ, రేవంత్‌కానీ, ష‌ర్మిల కానీ.. ఎక్క‌డున్నార‌నే ప్ర‌శ్న‌కు వీరి నుంచి స‌మాధానం వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. సో.. మొత్తానికి పాదయాత్ర‌ల రాజ‌కీయం.. కొంత మేర‌కు ప్ర‌భావం చూపుతుందే త‌ప్ప‌.. మొత్తంగా కేసీఆర్‌ను గ‌ద్దెదించేంత సీన్ ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.