కిమ్‌తో మాట్లాడుతా..కానీ ఒక్క ష‌ర‌తు : ట్రంప్‌

కిమ్‌తో మాట్లాడుతా..కానీ ఒక్క ష‌ర‌తు : ట్రంప్‌

ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్న వాతావ‌ర‌ణం స‌ద్దుమ‌ణుగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ మ‌ధ్య వాదోప‌వాదాలకు తెర‌ప‌డే చాన్స్ ఉంద‌ని తాజా ప‌రిణామంతో చ‌ర్చ జ‌రుగుతోంది.దక్షిణకొరియాతో చర్చలకు ఉత్తరకొరియా అంగీకరించడంతో ట్రంప్‌ తన దూకుడును తగ్గించారు. దక్షిణకొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటామని కిమ్‌ ప్రకటించడంతో ట్రంప్‌ మెత్తబడ్డారు. కిమ్‌తో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌న్నారు.

నూతన సంవత్సర సందేశంలో భాగంగా అణుదాడి బటన్‌ తన టేబుల్‌పైనే ఉంటుందని కిమ్‌ అమెరికాకు హెచ్చరికలు జారీచేయడంతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ తన వద్ద అంతకంటే పెద్ద అణు బటన్‌ ఉన్నదని తీవ్రంగా ప్రతిస్పందించారు. అయితే దక్షిణకొరియాతో చర్చలకు సిద్ధమని కిమ్‌ ప్రకటించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో తాజాగా  కిమ్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అమెరికా మేరీల్యాండ్‌లోని క్యాంప్‌ డేవిడ్‌లో మీడియాతో మాట్లాడారు. అమెరికా, దక్షిణకొరియా నిర్ణయించడంతో.. చర్చలకు ఉత్తరకొరియా అంగీకరించింది. దీంతో రెండేళ్ల‌ తర్వాత ఉభయ కొరియాల మధ్య చర్చలకు ఆస్కారం ఏర్పడింది.

కిమ్‌తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిస్తూ ‘కిమ్‌తో తప్పకుండా మాట్లాడుతా. అతనితో మాట్లాడటానికి నాకు ఎటువంటి సమస్యా లేదు. కానీ దానికి కొన్ని షరతులు ఉంటాయి. చూడండి అవి (ఉభయ కొరియాలు) ఒలింపిక్స్‌పై చర్చలు జరుపుతున్నాయి. ఇది శుభారంభం. ఒకవేళ నేను ఈ విషయంలో జోక్యం చేసుకోకపోయి ఉంటే వారు ఎప్పటికీ చర్చలు జరిపే అవకాశం లేదు. చర్చలు ఫలప్రదమైతే అది ప్రపంచానికి గొప్ప బహుమతి అవుతుంది. శీతాకాల ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియా భాగస్వామి అయితే చూడాలని ఉన్నది’ అని పేర్కొన్నారు. ఇది గొప్ప దౌత్య విజయమని పేర్కొన్న ట్రంప్‌.. చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు