సినీ పరిశ్రమను తరలించడంపై బాలయ్య మాట..

సినీ పరిశ్రమను తరలించడంపై బాలయ్య మాట..

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోతుందా అన్న ప్రచారం కొంతమేర నడిచింది. ఎందుకంటే సినీ పరిశ్రమకు చెందిన మెజారిటీ జనాలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు. చంద్రబాబు సర్కారు వీళ్లందరినీ ఆంధ్రకు రప్పించడానికి ప్రోత్సాహకాలిస్తుందని.. అమరావతిలో, ఇంకా ఆంధ్రా ప్రాంతంలోని మరిన్ని చోట్ల సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఐతే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి మూడున్నరేళ్లు దాటినా అలాంటి దాఖలాలేమీ కనిపించలేదు. ఇండస్ట్రీ చక్కగా హైదరాబాద్‌లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. ఐతే ఏపీ సర్కారు తరఫున గంటా శ్రీనివాసరావు లాంటి మంత్రులు మాత్రం ఇండస్ట్రీని వైజాగ్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రోత్సాహకాల పేరుతో ప్రకటనలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను ఆంధ్రాకు తరలించడంపై ఏపీ సర్కారులో భాగమైన నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ పూర్తిగా అక్కడికి తరలిపోవాల్సిన అవసరం లేదని బాలయ్య అన్నాడు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అందమైన లొకేషన్లు మాట వాస్తవం. అక్కడ షూటింగులు జరగాలి. ఐతే మొత్తంగా పరిశ్రమ అంతా హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. అలా కోరుకోకూడదు. మద్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి బలమైన కారణం ఉంది. ప్రాంతీయత, భాష ప్రభావం చూపించాయి. కానీ ఇప్పుడు ఇక్కడున్నవి రెండూ తెలుగు రాష్ట్రాలే. తెలంగాణ అన్నా మన తెలుగువాళ్లే కాదా. రెండు తెలుగు రాష్ట్రాలూ చిత్ర సీమకు రెండు కళ్లు. కాబట్టి పరిశ్రమ తరలివెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్లది. ఐతే నేను మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్టూడియో నిర్మిస్తాను’’ అని బాలయ్య చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు