త్రివిక్రమ్‌ పంచ్‌ జగన్‌కి తగిలింది

త్రివిక్రమ్‌ పంచ్‌ జగన్‌కి తగిలింది

అజ్ఞాతవాసి ట్రెయిలర్‌లో ఒక డైలాగ్‌ వైరల్‌ అయిపోయింది. 'వీడు మళ్లీ సైకిల్‌ ఎక్కుతాడంటావా వర్మా?' అని అడిగితే 'వాడు ఏది ఎక్కినా ఫర్వాలేదు కానీ మనల్ని ఎక్కకుండా వుంటే అదే చాలు' అని రెస్పాన్స్‌ వుంటుంది. ఈ డైలాగ్‌ సినిమాలో ఒక సీన్‌కి సంబంధించినదే అయినా కానీ పవన్‌ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ప్రశ్న సంధించినట్టు వుంది.

గత ఎన్నికల్లో సైకిల్‌ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్‌ మళ్లీ తెలుగుదేశానికి మద్దతు ఇస్తాడా అని ప్రతిపక్షం కలవర పడుతున్నట్టుగా, ఒకవేళ మద్దతు ఇచ్చినా కానీ గతంలో చేసినట్టుగా తమపై దాడి చేయకూడదు అని భావిస్తున్నట్టుగా ఈ డైలాగ్‌లో మరో మీనింగ్‌ వుందంటూ ఫాన్స్‌ సందడి చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పవన్‌ బద్ధ శత్రువయ్యాడు. మరోవైపు చంద్రబాబుతో పవన్‌ స్నేహ సంబంధాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా అజ్ఞాతవాసి చిత్రానికి వారం మొత్తం స్పెషల్‌ షోలు వేసుకునేందుకు పర్మిషన్‌ ఏపీ గవర్నమెంట్‌ ఇచ్చేసింది. దీంతో ఈ డైలాగ్‌ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ డైలాగ్‌ని ఇలా అర్థం చేసుకుంటారనేది త్రివిక్రమ్‌కి తెలియదని అనుకోవడానికి లేదు.

కావాలనే అతను ఈ డైలాగ్‌ పెట్టడం, దానిని ట్రెయిలర్‌లోను పెట్టడం జరిగిందని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక సినిమాలో ఇలాంటి చమక్కులు ఎన్ని వున్నాయో చూడాలిక. పవన్‌ పాలిటిక్స్‌కి సంబంధించిన పంచ్‌ డైలాగులయితే త్రివిక్రమ్‌ చాలానే రాసాడనేది బలంగా వినిపిస్తోన్న టాక్‌.