వైసీపీ నేతల్లో నిరుత్సాహం ?

వరుసగా రెండోసారి కూడా అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలు వాయిదా వేసుకోవాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగానే ఈ సంవత్సరంలో నిర్వహించాలని అనుకున్న ప్లీనరీని కూడా వాయిదా వేయాలని జగన్మోహన్ రెడ్డి అత్యత ముఖ్యనేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగాల్సిన మొదటి ప్లీనరీని ఎంతో ఘనంగా నిర్వహించాలని పోయిన సంవత్సరమే అనుకున్నారు.

జూలై 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో బ్రహ్మాండంగా జరిపేందుకు జగన్ ఆధ్వర్యంలో నిర్ణయం కూడా జరిగింది. అయితే హఠాత్తుగా కరోనా వైరస్ సమస్య మొదలవ్వటంతో మొదటి ప్లీనరీ వాయిదాపడింది. దాంతో ఈ సంవత్సరం జూలైలో అయినా రెండోప్లీనరీని నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఇపుడు కూడా ప్లీనరీ నిర్వహించే పరిస్ధితులు కనబడటంలేదు.

కరోనా తీవ్రత కారణంగా రెండో ప్లీనరీ సమావేశాలను కూడా వాయిదా వేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. నిజానికి జూలై 9, 10 తేదీలంటే ఇక ఎక్కువ వ్యవధికూడా లేదు. ఒకవైపు జనాలను భౌతిక దూరం పాటించాలని చెబుతు అధికారపార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించటం మంచిది కాదని జగన్ అభిప్రాయపడ్డారట. అధికారంలో ఉంది కాబట్టి ఎంత వద్దని చెప్పినా నేతలు, కార్యకర్తలు భారీగా హాజరవ్వటం ఖాయం.

కరోనా మళ్ళీ విజృంభిస్తున్నదనే సంకేతాలు, థర్డ్ వేవ్ మరింత ప్రమాధకరమనే ఆందోళనల మధ్య ప్లీనరీ సమావేశాలను నిర్వహించకపోవటమే అన్నీ విధాల మంచిదని జగన్ డిసైడ్ చేయటంతోనే సమావేశాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్లీనరీని కూడా అంతే ఘనంగా నిర్వహించాలని ఉన్న నిర్వహించలేకపోవటంతో నేతలంతా తెగ బాధపడిపోతున్నారు.