ఆ హీరోకు అల్లువారంటే ఎంత గౌరవమో

ఆ హీరోకు అల్లువారంటే ఎంత గౌరవమో

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత తెలుగులో చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సూర్య. అతడికి ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టిన సినిమా ‘గజిని’. ఐతే ఇంకెవరైనా ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో ఏమో కానీ.. అప్పట్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున రిలీజ్ చేశాడు. ప్రమోషన్ కూడా గట్టిగా చేశాడు. ఒక డైరెక్ట్ పెద్ద తెలుగు సినిమా స్థాయిలో ఆ సినిమా అప్పట్లో ఇరగాడేసింది. చాలా పెద్ద హిట్టయింది. దెబ్బకు సూర్య తెలుగులోనూ స్టార్ అయిపోయాడు. అప్పట్నుంచి అతడి ప్రతి సినిమా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజవుతోంది.

ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ మీద విపరీతమైన గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తుంటాడు సూర్య. తాజాగా ‘గ్యాంగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ అరవింద్ మీద అతను చూపించిన గౌరవ భావం చర్చనీయాంశం అయింది. అరవింద్ వల్లే తనకు తెలుగులో ఆదరణ వచ్చిందని.. ఆ రోజు ‘గజిని’ సినిమాను ఆయన చేతుల్లోకి తీసుకుని రిలీజ్ చేయడం వల్లే అది అంత పెద్ద హిట్టయిందని.. తమ గ్యాంగ్ అందరికీ ఇక్కడ లైఫ్ ఇచ్చారని తెగ పొగిడేశాడు సూర్య. అల్లు అరవింద్ చేతులు పట్టుకుని వంగి నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఆయనపై తన గౌరవభావాన్ని చాటుకున్నాడు సూర్య. ఐతే తర్వాత మైకు అందుకున్న అరవింద్.. తన వల్లే ‘గజిని’ హిట్టయిందని సూర్య అనుకుంటున్నాడని.. కానీ అతను అద్భుతంగా నటించడం వల్లే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది తప్ప తాను చేసిందేమీ లేదని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు