పవన్‌ను ఎవ్వరూ వదలట్లేదే..

పవన్‌ను ఎవ్వరూ వదలట్లేదే..

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరును తెగ వాడేసేవాళ్లు సినీ జనాలు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అలాగే ఉపయోగపడుతోంది. పవన్‌కు ఉన్న క్రేజుని వాడేసుకోవడానికి చాలామందే ట్రై చేస్తున్నారు. తాజాగా ‘గ్యాంగ్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సైతం పవన్నామస్మరణే జరిగింది. హీరో సూర్య.. దర్శకుడు విఘ్నేష్ శివన్.. హీరోయిన్ కీర్తి సురేష్.. ఇలా ఎవ్వరు మైక్ అందుకున్నా పవన్ గురించే మాట్లాడారు. ముందు విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రా భోజనం కారం ఎక్కువ. వాళ్లకు సినిమా అంటే మమకారమూ ఎక్కువే’’ అంటూ ఒక పంచ్ డైలాగ్ వేశాడు. ఆ తర్వాత తమ ‘గ్యాంగ్’ టీం అంతా కలిసి ఈ నెల పదో తారీఖున పవర్ స్టార్ సినిమా ‘అజ్ఞాతవాసి’ చూడబోతున్నామని.. అలాగే తెలుగు ప్రేక్షకులందరూ 12వ తేదీన గ్యాంగ్‌లు గ్యాంగ్‌లుగా ‘గ్యాంగ్’ సినిమాకు రావాలని అతను కోరాడు.

ఇక సూర్య సైతం ‘అజ్ఞాతవాసి’ ఊసెత్తాడు. అందరూ ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చాడు. ఇక ‘అజ్ఞాతవాసి’లో కథానాయికగా కూడా నటిస్తున్న కీర్తి సురేష్ సైతం ఆ సినిమా ప్రస్తావన తెచ్చింది. ఆ సినిమా చూడాలని కోరింది. ఇలా మొత్తంగా అందరూ పవన్నామస్మరణ చేసి ఇది ‘గ్యాంగ్’కు సంబంధించిన ఈవెంటా.. లేక ‘అజ్ఞాతవాసి’కి సంబంధించిన కార్యక్రమమా అని సందేహాలు రేకెత్తించారు.

ఇవన్నీ కూడా అల్లు అరవింద్ సమక్షంలోనే జరగడం విశేషం. కానీ ఆయన మాత్రం పవన్ పేరు కానీ.. ‘అజ్ఞాతవాసి’ ఊసు కానీ ఎత్తకపోవడం గమనార్హం. ఇంతకుముందు పవన్‌తో అరవింద్‌కు మంచి సంబంధాలే ఉండేవి. కానీ ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలతో ఇద్దరికీ దూరం పెరిగింది. అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ కామెంట్లతో అది మరింత విస్తరించింది. ఈ మధ్య అరవింద్ ఎక్కడా పవన్ పేరే ఎత్తకపోవడం గమనించవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు