అజ్ఞాతవాసి ట్రైలర్.. వస్తుందా రాదా?

అజ్ఞాతవాసి ట్రైలర్.. వస్తుందా రాదా?

పోయిన నెల 26కే రావాల్సింది ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జనవరి 4న ట్రైలర్ రిలీజవడం గ్యారెంటీ అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంచ్ అంటూ గట్టి ప్రచారమే జరిగింది. కానీ ఆ రోజు కూడా ట్రైలర్ రాలేదు. ఇంకో రెండు రోజులు గడిచాయి. ట్రైలర్ ఊసు లేదు. సినిమా విడుదలకు ఇంకో నాలుగు రోజులు మాత్రమే మిగిలుంది. యుఎస్ లో అయితే ఒక రోజు ముందే షోలు పడిపోతాయి. మరి ఇప్పుడైనా ట్రైలర్ రిలీజవుతుందా లేదా అన్నది తెలియడం లేదు. ఇక ట్రైలర్ రిలీజవడం డౌటే అని అంటున్నారు. ఇది ప్రమోషన్ పరంగా కచ్చితంగా చేటు చేసే విషయమే. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలున్నప్పటికీ.. ట్రైలర్ రిలీజైతే వచ్చే బజ్ వేరుగా ఉంటుంది.

‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ లాంచ్ కాకపోవడానికి కాపీ ఆరోపణలే కారణమని భావిస్తున్నారు. ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’కు ఇది కాపీ అనే ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఓవైపు సినిమా విడుదల సన్నాహాల్లో బిజీగా ఉన్న ‘అజ్ఞాతవాసి’ నిర్మాతకు ఈ ఇష్యూ పెద్ద తలపోటుగా మారింది. టీ సిరీస్ వాళ్లతో ఇష్యూ సెటిల్ చేసుకునే క్రమంలో ట్రైలర్ సంగతి వదిలేశారు. ట్రైలర్ బయటికి వస్తే ‘లార్గో వించ్’తో ఇంకేవైనా పోలికలు కనిపించి.. ఇష్యూ పెద్దదవుతుందేమో అన్న కంగారుతో కూడా ట్రైలర్ ఆపినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడు ఈ ఇష్యూ సెటిలైపోయిందని.. ‘అజ్ఞాతవాసి’ విడుదలకు మార్గం సుగమమైందని అంటున్నారు. అలాంటపుడు గ్యాప్ తక్కువన్నా పర్వాలేదని ఇప్పుడైనా ట్రైలర్ లాంచ్ చేస్తారా.. ఆమాత్రం కూడా ఎందుకులే అని వదిలేస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు