‘అజ్ఞాతవాసి’కి గ్రౌండ్ క్లియర్

‘అజ్ఞాతవాసి’కి గ్రౌండ్ క్లియర్

క్రిస్మస్ వీకెండ్లో వచ్చిన సినిమాల్లో ‘ఎంసీఏ’ మాత్రమే నిలబడింది. రెండో వీకెండ్ తర్వాత ఆ సినిమా జోరు కూడా తగ్గిపోయింది. ఇక ‘హలో’ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. టాక్ ఎంత బాగున్నా.. ఫస్ట్ వీకెండ్ అవ్వగానే వసూళ్లు బలహీనపడిపోయాయి. ఇక తర్వాతి వారం వచ్చిన రెండు సినిమాల్లో ‘ఒక్క క్షణం’కు టాక్ పర్వాలేదన్నట్లు వినిపించింది. కానీ ఆ సినిమా జనాల్ని అనుకున్నంత స్థాయిలో థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక సునీల్ సినిమా ‘2 కంట్రీస్’ గురించి చెప్పడానికేమీ లేదు. దానికి కనీస ఓపెనింగ్స్ లేవు. మొత్తంగా ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే ఏ సినిమా కూడా అంతగా ఆడట్లేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ వీకెండ్లో కొత్త సినిమాల రిలీజే లేకపోయింది.

సంక్రాంతి సినిమాల సందడి బుధవారం నుంచే మొదలవుతుండటంతో ఈ వీకెండ్‌ను ఖాళీగా వదిలేశారు. సంక్రాంతి సీజన్లో ముందుగా రాబోతున్న ‘అజ్ఞాతవాసి’కి ఇప్పుడు గ్రౌండ్ క్లియర్‌గా ఉంది. ఆ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా.. ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి.. ప్రమోషన్ల జోరు పెంచితే హైప్ మరింత పెరుగుతుంది. ‘అజ్ఞాతవాసి’ని తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతానికి పైగా థియేటర్లలో నింపేయడం ఖాయం. ముందు రోజు రాత్రి నుంచే బెనిఫిట్ షోలు.. స్పెషల్ షోల హంగామా మొదలైపోతుంది. అమెరికాలో ఈ చిత్రాన్ని ఏ భారతీయ సినిమానూ రిలీజ్ చేయని స్థాయిలో భారీగా విడుదల చేస్తున్నారు. తొలి రోజు వసూళ్లు అంచనాలకు అందని స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English