చరణ్‌ ఫాన్స్‌ భయపడక్కర్లేదు

చరణ్‌ ఫాన్స్‌ భయపడక్కర్లేదు

బోయపాటితో సినిమా అనే సరికి రామ్‌ చరణ్‌ ఫాన్స్‌ కొంచెం వర్రీ అవుతున్నారు. ఏ మాస్‌ ఇమేజ్‌ నుంచి అయితే బ్రేక్‌ తీసుకోవాలని చరణ్‌ అనుకుంటున్నాడో మళ్లీ అలాంటి మూసలో పడేసే సినిమా ఒప్పుకోవడమేంటని అనుకుంటున్నారు. బోయపాటి శ్రీను అంటేనే ఊర మాస్‌ సినిమాలకి పెట్టింది పేరు. అందుకే అతనితో సినిమా అనేసరికి చరణ్‌కి మళ్లీ పూర్వ అనుభవం రిపీట్‌ అవుతుందేమో అనే కలవరం ఫాన్స్‌లో వుంది.

ఇప్పుడిప్పుడే ట్రాక్‌ మారుస్తున్న చరణ్‌ ముందుగా కొరటాల శివ చిత్రం చేయకుండా ఇది చేయడానికి రెడీ అవడం ఫాన్స్‌కి ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది బోయపాటి మార్కు మాస్‌ సినిమా కాదని సమాచారం. ఫ్యామిలీ డ్రామా ఎక్కువ వుండే ఈ చిత్రంలో బోయపాటి మార్కు యాక్షన్‌ వుంటుందట కానీ మరీ వీర లెవల్‌ మాస్‌ సీన్లు వుండవట. భారీ పంచ్‌ డైలాగులు, బౌన్సింగ్‌ ఫైట్లు లేకుండా ఈ చిత్రాన్ని నీట్‌గా ఫ్యామిలీ డ్రామాలా తీర్చిదిద్దబోతున్నాడట.

బోయపాటి సామర్ధ్యంపై నమ్మకం వుండడంతో మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ఈ ప్రాజెక్టుని ఓకే చేసారని, చరణ్‌కి కూడా కథ బాగా నచ్చిందని సమాచారం. ఈ చిత్రాన్ని ఇదే నెలలో మొదలు పెడుతున్నారు. ఇప్పటికే చరణ్‌ తన రంగస్థలం లుక్‌ కాస్త మార్చేసుకుని ఈ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలో చరణ్‌వి రెండు సినిమాలు రిలీజ్‌ కావడం ఖాయమని సోర్సెస్‌ చెబుతున్నాయి. బోయపాటి సినిమా ఆరు నూరైనా దసరాకి రిలీజ్‌ అయిపోతుందట. రంగస్థలం ఏమో మార్చి 30న విడుదలకి సిద్ధమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు