2018 పండగలపై ఖాన్ త్రయం అటాక్

2018 పండగలపై ఖాన్ త్రయం అటాక్

తెలుగు సినిమాలకు అతి పెద్ద పండగ సీజన్ అంటే సంక్రాంతే. దీని తర్వాత దసరాకు సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఐతే బాలీవుడ్ వాళ్ల గురి మాత్రం వేరే పండగల మీద ఉంటుంది. రంజాన్.. దీపావళి.. క్రిస్మస్ పండగల్ని అక్కడి బడా స్టార్లు టార్గెట్ చేస్తారు. గత ఏడాది వీటిలో రెండు పండగల్ని సల్మాన్ ఖాన్ కబ్జా చేశాడు. రంజాన్‌తో పాటు క్రిస్మస్‌కూ తన సినిమాలు రిలీజ్ చేశాడు. ఈద్‌కు వచ్చిన ‘ట్యూబ్ లైట్’ తేలిపోగా.. క్రిస్మస్‌కు వచ్చిన ‘టైగర్ జిందా హై’ బ్లాక్ బస్టర్ అయింది. దీపావళికి ‘సీక్రెట్ సూపర్ స్టార్‌’తో పలకరించిన అమీర్ పర్వాలేదనిపించాడు.

ఇక కొత్త ఏడాదిలో ఈ మూడు పండగలకూ ముగ్గురు బడా స్టార్ రాబోతున్నారు. ముగ్గురు ఖాన్‌లూ మూడు పండగల్ని పంచేసుకోవడం విశేషం. ముందుగా సల్మాన్ ఖాన్ ఎప్పట్లాగే ఈద్‌కు తన సినిమాను షెడ్యూల్ చేసుకున్నాడు. వచ్చే రంజాన్ పండక్కి సల్మాన్ చిత్రం ‘రేస్-3’ విడుదలవుతుంది. ఆ తర్వాత దీపావళికి అమీర్ ఖాన్ పలకరించబోతున్నాడు. అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో అమర్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘ధూమ్’ సిరీస్ రచయిత, ‘ధూమ్-3’తో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటిదాకా ఉన్న కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేస్తుందన్న అంచనాలున్నాయి. ఇక కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న షారుఖ్ ఖాన్ ఏడాది చివర్లో క్రిస్మస్ పండక్కి రాబోతున్నాడు. షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ‘జీరో’ డిసెంబరు 21న రిలీజవుతుంది. ఈ చిత్రాన్ని ఆనంద్.ఎల్.రాయ్ రూపొందిస్తున్నాడు. మరి 2018 ఖాన్ త్రయంలో ఎవరు ఎలాంటి ఫలితాలనందుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English